కృష్ణుడిని పూజిస్తే సమస్యలు వచ్చాయట.. ఐదో తరగతి పుస్తకంలో వివాదాస్పద పాఠం

కృష్ణుడిని పూజిస్తే సమస్యలు వచ్చాయట.. ఐదో తరగతి పుస్తకంలో వివాదాస్పద పాఠం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్ సీఈఆర్టీ) వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. పదో తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీపై రాజ్యాంగ పీఠికనే తప్పుగా ముద్రించిన అధికారులు.. తాజాగా ఐదో తరగతి వర్క్ బుక్ లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించడంతో గ్రామంలో సమస్యలు వచ్చాయంటూ వివాదాస్పద పాఠాన్ని పెట్టారు. దీనిపై పలు టీచర్ల సంఘాలు, హిందూ టీచర్లు మండిపడుతున్నారు. రాజ్యాంగ పీఠిక విషయంతో పాటు వర్క్ బుక్ పాఠం ముద్రణకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠ్య పుస్తకాలను ఎస్​సీఈఆర్టీ రూపొందిస్తుంది. అయితే, 2023-–24 విద్యాసంవత్సరానికి ఎస్​సీఈఆర్టీ రూపొందించిన ఐదో తరగతి తొలిమెట్టు తెలుగు వర్క్ బుక్ లో కృష్ణుడిపై వివాదాస్పద పాఠాన్ని పొందుపర్చడం వివాదానికి దారితీసింది. ప్రాక్టీస్ వీక్లీ టెస్ట్–1లో మహాభారతంలోని ఓ ఘట్టం అంటూ పాఠం పెట్టారు. ‘‘పాండవులు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే సమయంలో ఒక ఊరివాళ్లకు కృష్ణుడి విగ్రహాన్ని ఇస్తారు. 

దానికి గుడి కట్టి గ్రామస్తులు పూజలు చేయగా, ఊరిలో రకరకాల సమస్యలు వచ్చాయి. దాంతో స్వామిజీ సలహాతో ఆ విగ్రహాన్ని కొలనులో వదిలేశారు..” అంటూ పాఠంలో పేర్కొన్నారు. అయితే, ఈ పాఠంపై హిందూ టీచర్ల సంఘాల నేతలు మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పాఠం పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మహాభారతంలో ఇలాంటి ఘట్టమేదీ లేదని అంటున్నారు. మూడో తరగతి సైన్స్ వర్క్ బుక్​లోనూ ఓ వర్గాన్ని కించపర్చేలా పాఠ్యాంశం పెట్టారని చెబుతున్నారు. 

ఆన్​లైన్​లో తొలగించాం: ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్  

ఐదో తరగతి వర్క్ బుక్​లో ఈ పాఠాన్ని తొలగించాలని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్​సీఈఆర్టీ అధికారులను తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్  కలిసి డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

దీనిపై ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని ‘వెలుగు’ వివరణ కోరగా.. ఈ పొరపాటు తమ దృష్టికి రాగానే దాన్ని ఆన్​ లైన్ నుంచి తొలగించామన్నారు. ఆ పాఠాన్ని పిల్లలకు బోధించవద్దని ఆదేశాలు జారీచేశామని వివరించారు. అది ఎవరూ కావాలని చేయలేదని, పొరపాటుగా వచ్చినందుకే ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు.