
నెల్లికుదురు, (కేసముద్రం) వెలుగు : చింత పండు పంపకాల విషయంలో జరిగిన గొడవ చివరకు తమ్ముడి ప్రాణం మీదికి తెచ్చింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన లొల్లి కత్తితో పొడుచుకునే వరకు వెళ్లింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన గాదేగాని రమేశ్, నరేశ్ లు అన్నదమ్ములు. శుక్రవారం ఉదయం ఇంటి ముందున్న చింత చెట్టుపై ఉన్న చింతపండును అన్న రమేశ్ఏరుకుని ఇంట్లో పోసుకున్నాడు.
ఈ క్రమంలో తమ్ముడు నరేశ్ తనకు కూడా వాటా కావాలని అడిగాడు. ‘ఇన్ని రోజులు నువ్వు హైదరాబాద్లో ఉంటే నేనే చెట్టును కాపాడిన..నాకు కూడా భాగం వస్తది’ అని అన్నతో వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరి తారస్థాయికి చేరింది. కోపం పెంచుకున్న అన్న రమేశ్కత్తితో తమ్ముడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నరేశ్ ను స్థానికులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.