- కేడర్ విభజనకు విద్యాశాఖ చర్యలు
- కోర్టుకు పోయిన 72 మంది టీచర్లు
- ఆఫీసర్లలో అయోమయం.. ముందుకు కదిలేది కష్టమే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్ల స్థానికత సర్దుబాటు వ్యవహారం చిక్కుముడిగా మారింది. జీవో 317 ప్రకారం చేపట్టిన ఉద్యోగుల అలకేషన్ ప్రక్రియ కోర్టు మెట్లెక్కడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఈ నెల 16 వరకు ఆప్షన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ, తాజా పరిణామాలతో అసలు బదిలీలు జరగడం కష్టమేననీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనల ప్రకారం మార్పులు చేస్తే కొన్నిచోట్ల పోస్టులు ఎక్సెస్ అయ్యే ప్రమాదం ఉండటంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లు ఉండగా, వాటిలో సుమారు 3వేల మంది పనిచేస్తున్నారు. వీరికి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం కొత్త జోనల్, మల్టీజోన్ల ప్రకారం కేడర్ విభజన చేసేందుకు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీరిలో ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టులను మల్టీ జోన్ల పరిధిలో, టీజీటీ పోస్టులను జోన్ల పరిధిలో సర్దుబాటు చేయాలని నిర్ణయించి అధికారులు డేటాను రెడీ చేశారు.
రాష్ట్రంలో మొత్తం 194 ప్రిన్సిపాల్పోస్టుకు గానూ ప్రస్తుతం 96 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరిలో ఉమ్మడి జోన్-5 లో 34 మంది, జోన్-6 లో 62 మంది పనిచేస్తున్నారు. వీరిని మల్టీ జోన్-1 కు 58 మందిని, మల్టీ జోన్-2 కు 38 మందిని అలాట్ చేయాల్సి ఉంది. పీజీటీలు పది సబ్జెక్టుల్లో 2464 పోస్టులకు గానూ 1904 మంది పనిచేస్తున్నారు. వీరికీ మల్టీజోన్ల వారీగా కేడర్ విభజన చేశారు. మరోపక్క 749 మంది టీజీటీల డేటాను కూడా జోన్ల వారీగా సిద్ధం చేశారు.
కోర్టుకు టీచర్లు..
మోడల్ స్కూళ్లలో కేడర్ విభజనను సవాల్ చేస్తూ ఇప్పటి వరకూ 72 మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. మోడల్ స్కూళ్లు సొసైటీ పరిధిలోకి వస్తాయని, వీటికి సర్కారు ఇచ్చే జీవోలు నేరుగా వర్తించవని వారు వాదిస్తున్నారు. జీవో 317 అలకేషన్ గడువు ఎప్పుడో ముగిసిపోయిందని, ఇప్పుడు కొత్తగా ప్రక్రియ మొదలుపెట్టాల్సిన అవసరం లేదని న్యాయస్థానాన్ని కోరారు. విచారణ చేపట్టిన కోర్టు.. సదరు 72 మందికి స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలతో అధికారుల లెక్కలు తలకిందులయ్యాయి.
జిల్లాల మార్పుతో టెన్షన్
ఆప్షన్ల ప్రక్రియ ఈనెల16తో పూర్తయింది. దీంతో ఎవరు ఆ జిల్లాలో ఉంటారు.. ఎవరు వెళ్లిపోవాల్సి ఉంటుందనే దానిపై టీచర్లలో ఓ క్లారిటీ వచ్చింది. చాలామంది ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నచ్చని చోటుకి పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, కోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చుకున్న వారిని పాత చోటే ఉంచితే.. కొత్తగా వచ్చే వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనివల్ల కొన్ని స్కూళ్లలో పోస్టులు మంజూరైన దానికంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
హైకోర్టు ఆర్డర్ తో ఇప్పుడు అలకేషన్ ప్రక్రియను కొనసాగించాలా లేక నిలిపివేయాలా? అనే దానిపై విద్యాశాఖ అధికారుల్లో స్పష్టత కరువైంది. ఒకవేళ కొందరికి మినహాయింపు ఇచ్చి, మిగిలిన వారిని బదిలీ చేస్తే సీనియారిటీ తదితర అంశాల్లో వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. దీంతో మోడల్ స్కూల్ టీచర్ల అలకేషన్ ప్రక్రియ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదని అధికార వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది.
