ఆయిల్​ లేదు.. బాయిల్​ వద్దు

ఆయిల్​ లేదు.. బాయిల్​ వద్దు

కూరలో కొంచెం నూనె తగ్గితేనే టేస్ట్‌‌ లేదు అని పెదవి విరుస్తారు. అలాంటిది నూనె లేకుండా వంట చేస్తే! తినగలమా? ‘నూనె లేకుండానే కాదు.. ఉడికించకుండా కూడా వండేయొచ్చు. హాయిగా తినొచ్చు’ అంటున్నాడు పడయాళ్​ శివకుమార్​. ‘నో ఆయిల్ – నో బాయిల్​’ కాన్సెప్ట్‌‌తో ఏకంగా రెండువేల రకాల వంటకాలు వండి రికార్డ్‌‌ క్రియేట్​ చేశాడు. అంతేకాదు.. ఈ కాన్సెప్ట్‌‌తో వండిన వంటలతో ఒక రెస్టారెంట్‌‌ కూడా నడుపుతున్నాడు. 

పూర్వీకులు చాలా మంది ‘ఆహారమే ఔషధం’  అనే సామెతను చెప్పారు. కానీ.. ఇప్పుడు మాత్రం కొన్ని రకాల ఫుడ్స్​ విషంతో సమానం అంటున్నారు. అందుకే మనం రోజూ తినే ఆహారాన్ని ఔషధంగా ఎలా మార్చుకోవాలో చెప్తున్నాడు శివకుమార్. మామూలుగా వంట చేయాలంటే ఇంగ్రెడియెంట్స్​తోపాటు నూనె తప్పనిసరి. కొన్ని వంటలకి అయితే ఒవెన్​ కూడా ఉండాలి. కానీ.. శివకుమార్​ వంట చేయాలంటే.. ఇంగ్రెడియెంట్స్​ ఉంటే చాలు. ఆయిల్​, బాయిల్... రెండూ​ అవసరం లేదు. అవేవీ లేకుండానే రుచికరంగా వండుతాడు. అది కూడా ఒకటిరెండు వంటలు కాదు.. ఏకంగా రెండు వేల రకాల వంటలు చేస్తాడు. ‘‘ఆధునిక ప్రపంచంలో అనేక అనారోగ్య సమస్యలకు ఆహారం ప్రధాన కారణం. ఊబకాయం, గుండెజబ్బులు, అలర్జీలు మొదలైన చాలా రకాల జబ్బులు ఫుడ్​ వల్లే వస్తాయి. అందుకే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఫుడ్​ తినాలనే ఉద్దేశంతో ఈ నేచురల్​ ఫుడ్ పద్ధతిని తీసుకొచ్చా” అంటున్నాడు పడయాళ్ శివ. 

శివకుమార్ సొంతూరు కోయంబత్తూరు. బికాం వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఆధ్యాత్మికత ఎక్కువ. అందుకే చిన్నప్పటినుంచి శాఖాహారం మాత్రమే తినేవాడు. ఇంట్లో వాళ్లు మాంసాహారం తింటున్నా శివ మాత్రం తినేవాడు కాదు. అదే టైంలో అతను నమ్మాళ్వార్(దక్షిణ భారతదేశంలోని వైష్ణవ సంప్రదాయానికి చెందిన 12 మంది ఆళ్వార్లలో (సాధువుల్లో) ఒకరు) ఫాలోవర్​ అయ్యాడు. ఆయన బోధనలు పాటించేవాడు. ఆ క్రమంలోనే సహజమైన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకున్నాడు.

నేచురల్​ ఫుడ్స్​

ప్రకృతితో మమేకమై జీవించడం. సహజసిద్ధమైన ఆహార పదార్థాలను వండకుండా తినడం ఆరోగ్యానికి మంచిది అని నమ్మాడు శివ. కానీ.. చాలా రకాల నేచురల్​ ఫుడ్స్​ని వండకుండా తినలేం. కాబట్టి వాటికోసం వంట చేయడంలో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను కనుక్కున్నాడు. పచ్చి కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్‌‌తో సహా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలన్నీ ఉడికించకుండా, నూనె వేయకుండా, పోషకాలు తగ్గకుండా టేస్టీగా తయారుచేస్తున్నాడు శివ.

ఎక్కడ నేర్చుకున్నాడు? 

ప్రకృతి వైద్యుడు శివకాశి మారన్‌‌ దగ్గర నేచురల్​ ఫుడ్​ని పొయ్యి లేకుండా ఎలా వండాలో నేర్చుకున్నాడు. తర్వాత వాటిని ఇంకాస్త డెవలప్​ చేశాడు. అలా వంద కంటే ఎక్కువ రకాల ఫుడ్స్​ను​ రంగురంగుల్లో తయారుచేశాడు. తర్వాత తంజావూరు, తిరుచ్చి, కుంభకోణం ప్రాంతాల్లో పొయ్యి లేకుండా వంట చేసేవాళ్లను గుర్తించి వాళ్ల దగ్గర ట్రైనింగ్​ తీసుకున్నాడు. పొయ్యి, నూనె లేకుండా వంట చేయడం అనే విషయం మీద దాదాపు ఏడాది పాటు రీసెర్చ్​ చేసి, చాలా విషయాలు తెలుసుకున్నాడు. తర్వాత రెండేండ్లలోనే 30 రకాల కొత్త వంటకాలను తయారుచేశాడు. ఇప్పుడు ‘నో ఆయిల్​, నో బాయిల్’​ పద్ధతిలో ఏకంగా 2000 వంటకాలు చేసే స్థాయికి ఎదిగాడు.  

ఎందుకు? 

మూడు పూటలా సహజసిద్ధమైన ఆహారపదార్థాలు తీసుకుంటే శరీరం దృఢంగా ఉండటమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని నమ్ముతాడు శివకుమార్​. కానీ.. నేచురల్​ ఫుడ్స్​ని అలాగే తినడం అందరికీ సాధ్యం కాదు. అందుకే ‘నో ఆయిల్​, నో బాయిల్’ సూత్రంతో వండుతున్నాడు. శివ కూడా 2014 నుండి అలా చేసుకున్న వంటలే తింటున్నాడు. 

రెస్టారెంట్​

తాను తినే ఆరోగ్యకరమైన ఆహారమే అందరూ తినాలనే ఉద్దేశంతో జనవరి 2021లో కోయంబత్తూరులోని సింఘనల్లూర్ దగ్గర్లో ‘పడయాల్’ అనే పేరుతో నేచురల్ రెస్టారెంట్ మొదలుపెట్టాడు. ఈ రెస్టారెంట్​లో ఒక్క ఒవెన్ కూడా లేదు. ఏ ఫుడ్​లో ఆయిల్​ ఉండదు. సాంబారు, కారకులంబు, రసం, పెరుగు, అవియల్, ఫ్రైస్, వడ, పాయసం లాంటివి పొయ్యి లేకుండానే వండుతున్నారు. ఇక్కడి ఫుడ్​ ధర 100 నుంచి 150 రూపాయల్లోపు ఉంటుంది. చాలా రకాల పండ్ల రసాలు 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇడ్లీ ఒక సెట్ 40 రూపాయలు. సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యమే వాడతారు. బియ్యంలో కిలిచి సాంబ, దుయ్యమల్లి, సీరక సాంబ, ఇలుబైబూ సాంబ లాంటి రకాలను వాడుతున్నారు. రైస్​ని కూడా ఉడికించకుండా కొబ్బరి పాలలో నానబెట్టి వడ్డిస్తారు. సాంబార్ కోసం పప్పును గ్రైండ్ చేసి అందులో జీడిపప్పు, బాదంపొడి వేస్తారు. పులుపు కోసం కొన్ని జ్యూస్​లు కలుపుతారు అంతే.. ఘుమఘుమలాడే సాంబార్ రెడీ. చింతపండు, పచ్చి పసుపు పచ్చళ్లు,12 గంటలు నానబెట్టిన కొబ్బరి పాలు లాంటి వెరైటీలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మరో స్పెషల్​ ఏంటంటే.. బాదం, కిస్​మిస్​లు నానబెట్టి తర్వాత జీడిపప్పు వేసి పాయసం చేస్తారు. 

మనుషులు మాత్రమే

ఈ రెస్టారెంట్‌‌ వంటగదిలో స్టవ్‌‌లు, ఇతర యంత్రాలేవీ ఉండవు. మనుషులు తమ చేతులతో తయారుచేస్తారు. అందుకే రోజంతా పని చేసినా అంతగా లాభాలు ఉండవు. కానీ.. నాణ్యమైన, రుచికరమైన, సహజసిద్ధమైన ఫుడ్​ అందిస్తున్నామనే తృప్తి ఉంటుంది అంటాడు శివ. అందుకే శివకుమార్ సేవలు, రీసెర్చ్​లకు మెచ్చి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌‌ ప్రదానం చేసింది. కోయంబత్తూరు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ‘సహజ ఆహారం – ఔషధం’అనే అంశంపై ఒక ప్రత్యేకమైన కోర్సు కూడా మొదలుపెట్టారు. 

పిల్లలతో...

‘‘పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పించాలి. పిల్లలకు నేచురల్​ లైఫ్​స్టయిల్​ అలవాటు చేయించాలి. అంతేకాదు.. వాళ్లకు ఆరోగ్యకరమైన శరీరం, మనసు కోసం బ్యాలెన్స్‌‌డ్​ ఫుడ్​ అందించాలి”  అందుకోసం నేచురల్​ ఫుడ్​ని అలవాటు చేయాలి అంటాడు శివ. అందుకే పిల్లలతోనే నేచురల్​ ఫుడ్​ చేయిస్తూ వాళ్లకు అవగాహన కల్పిస్తున్నాడు. గతేడాది ‘‘ఫ్లేమ్ ఆఫ్ నో ఆయిల్ నో బాయిల్” పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించాడు. అందులో 319 మంది స్టూడెంట్స్​ 4.27 నిమిషాల్లో 319 వంటలు చేశారు. అందరూ మంట, నూనె లేకుండానే వంట చేసి రికార్డు సృష్టించారు. ఇందులో నాలుగు నుంచి 16 ఏండ్ల మధ్య వయసు ఉన్న స్టూడెంట్స్​ పాల్గొన్నారు. తమిళనాడు, బెంగళూరులోని కొన్ని స్కూల్స్​లోని పిల్లల్ని సెలక్ట్​ చేసి దాదాపు నెల పాటు ఆన్​లైన్‌‌లో ట్రైనింగ్​ ఇచ్చారు.  ట్రైనింగ్​ తీసుకున్న స్టూడెంట్స్​ 30 సంప్రదాయ వరి రకాలు, ఏడు రకాల మిల్లెట్స్‌‌, ఈటబుల్​ ఫ్లవర్స్, కూరగాయలు, మూలికలు, పండ్లు, ధాన్యాలు వాడి వంటలు చేశారు. వాటిలో... వాజైపూ వడ, మాపిలై సాంబా కోజుకట్టై, లోటస్ కేక్, మందార బర్ఫీ, వల్లరై లడ్డూ, ఆవరంపూ ఎనర్జీ బాల్, వరాగు కిచడి, పుదీనా మజ్జిగ, కూరగాయల జంతికలు, పుడ్డింగ్స్​, మిక్స్‌‌డ్ రైస్​ అందర్నీ ఆకట్టుకున్నాయి. 

పదివేల మందికి ట్రైనింగ్​

పెండ్లిళ్లు, పుట్టినరోజులు ఇలా చాలా రకాల దావత్‌‌లలో కొన్ని వేల మందికి ఈ సహజసిద్ధమైన  సంప్రదాయ ఆహారాన్ని పరిచయం చేశాడు శివ. అంతేకాకుండా స్కూళ్లు, కాలేజీల్లో 250 కి పైగా శిక్షణా తరగతులు నిర్వహించి 10 వేల మందికి పైగా ట్రైనింగ్​ ఇచ్చాడు. ఒవెన్ లేకుండా, నూనె లేకుండా, పోషకాలు కోల్పోకుండా, రసాయనాలు కలపకుండా రుచిగా ఎలా వండాలో స్టూడెంట్స్‌‌కి చెప్పాడు. 

90 శాతం రోగాలు 

ఇప్పుడు పాత రోగాలతో పాటు అనేక రకాల కొత్త రోగాలు వస్తున్నాయి. వాటితో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. వాటిలో 90 శాతం రోగాలకు ఆహారపు అలవాట్లే కారణం అంటాడు శివకుమార్​. ‘‘మనం తినే ఆహారమే మన శరీరం, మనసుని సృష్టిస్తుంది.  సరిగా ఆలోచించేలా చేస్తుంది. కాబట్టి మంచి ఆహారం తిని మంచి దేశాన్ని నిర్మించుకోవాలి. మనం తినే ఆహారమే రక్తంగా, కొవ్వుగా, ఎముకలుగా, అస్థి మజ్జలుగా, శుక్రకణాలుగా మారుతుంది. ఆహారం​ గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి” అంటున్నాడు శివ.

ఈ ఫుడ్​తో లాభాలేంటంటే.. 

  • ‘‘ఉడికించకుండా తింటే.. ఆహారంలోని పోషకాలు పూర్తిగా అందుతాయి. 
  • నేచురల్​ ఫుడ్​ తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవు. దీని వల్ల చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 
  • ఈ ఫుడ్​ వల్ల సాత్విక స్వభావం ఏర్పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 
  • నూనె లేకుండా వంట చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. 
  • వండిన ఆహారంతో పోలిస్తే.. వండని ఆహారం బరువు పెరగకుండా సాయపడుతుంది. 
  • వంట చేసే టైం మిగులుతుంది. 

నేచురల్​ ఫుడ్ తినడం వల్ల షుగర్​, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు’’ అని చెప్తున్నాడు శివకుమార్​.