కూల్ డ్రింక్ తో ఆరోగ్యం కరాబ్

కూల్ డ్రింక్ తో ఆరోగ్యం కరాబ్

ఒకప్పుడు ఇంటికి అతిథులు వస్తే  మట్టి కుండలోంచి  చల్లటి  నీళ్లు ఇచ్చి,  ఆ తరువాత మజ్జిగో, నిమ్మరసమో కలిపి ఇచ్చే వాళ్లు. కాని ప్రస్తుతం    కూల్​డ్రింక్స్​​ తప్పనిసరి అయ్యాయి.  పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తాగుతున్నారు. కానీ ఈ  కూల్​డ్రింక్స్​​ ఎక్కువగా తాగడం వల్ల  ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

వేపవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం  ఎక్కువమంది శీతల పానీయాలు తాగడానికి ఆసక్తి చూపుతారు. యువత పార్టీ ఏదైనా బిర్యానీతో పాటు  కూల్​డ్రింక్​ ఉండాల్సిందేనంటారు. నలుగురు స్నేహితులు ఒకచోట కలిస్తే కబుర్లలో కూల్​డ్రింక్​ భాగమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కూల్​డ్రింక్​​ రోజువారీ జీవితంలో భాగమైంది. రోజుకు లీటర్​పైనే తాగేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇవి ఎక్కువగా తాగితే ప్రాణాలకు ముప్పు  తప్పదంటున్నారు నిపుణులు.

రక్తపోటుని పెంచుతుంది
 కూల్​డ్రింక్​లో 7 చెంచాలకు సరిపడా పంచదార ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో  చక్కెర తింటే  వాంతులు అవుతాయి. కాని కూల్  డ్రింక్​లో ఉండే ఫాస్ఫరిక్​ యాసిడ్​ వాంతులు రాకుండా చేస్తుంది. ఇది రక్తంలో చేరడం వల్ల షుగర్​ లెవల్స్​ అమాంతం పెరిగిపోతాయి. అంతేకాదు కూల్​డ్రింక్స్​లో ఉండే కెఫిన్​  వల్ల  శరీరంలో డోపమైన్​ అనే కెమికల్​ ఉత్పత్తి జరుగుతుంది.  దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది.   గుండె కొట్టుకునే వేగంలో కూడా మార్పులొస్తాయి. క్యాల్షియం తగ్గుతుంది.  కొన్ని సందర్భాల్లో  గుండె సమస్యలు తలెత్తి హార్ట్​ స్ర్టోక్​ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కూల్​ డ్రింక్స్​  మోతాదుకి మించి తాగకూడదు.  అసలు తాగకుండా ఉంటే… మీ ఆరోగ్యంతో పాటు పర్యావరణానికీ మేలు.

ఎన్నో సమస్యలు

కూల్​ డ్రింక్స్​లో ఫాస్ఫరిక్​ ​ యాసిడ్​, కార్బోలిక్​ యాసిడ్​ లాంటివి కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందుకే కూల్​ డ్రింక్స్​ని తాగిన వెంటనే త్రేన్పులు వస్తాయి.  కడుపులో మంట ఎసిడిటీ  సమస్యలు కూడా ఎదురవుతాయి.  అంతేకాదు ఫాస్ఫరిక్​ యాసిడ్​ చిన్న పేగులో చేరి అక్కడ ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, జింక్​ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. దీంతో తరచుగా మూత్రవిసర్జన జరగడంతో పాటు, డీహైడ్రేషన్​, దాహం లాంటివి పెరుగుతాయి.

ఆకలి మందగిస్తుంది

కూల్​డ్రింక్స్​ తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవి  కూల్​డ్రింక్స్​లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో డీహైడ్రేషన్​ బారిన పడి, నీరసం వస్తుంది. ఒక్కోసారి మూర్ఛపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు ​ నిల్వ ఉంచిన కూల్​డ్రింక్స్ తాగడం వల్ల  ఊపిరితిత్తులు దెబ్బతిని  శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీనిలో వాడే గ్యాస్​ వలన  ఆకలి కాదు. అలాగే తిన్న ఆహారం జీర్ణం కాక  బోలెడన్ని ఆరోగ్య సమస్యలొస్తాయి.

దంత సమస్యలు
కూల్​డ్రింక్స్​లో ఉండే యాసిడ్స్, చక్కెర దంతాలకు హాని చేస్తాయి. వీటివల్ల దంతాలపై ఉండే ఎనామిల్​ పొర కరిగిపోతుంది.  దంత క్షయం ఏర్పడుతుంది. దంతాల మీద బ్యాక్టీరియా చేరి దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ళ వాపు వంటి సమస్యలు కూడా  వస్తాయి. దంతాలు సెన్సిటివ్​గా  మారి చల్లని, వేడి పదార్థాలు కూడా తీసుకోలేకపోతారు.

ఆల్కహాల్​  శాతం పెంచుతున్నారు
కంపెనీలు తయారు చేసే  కూల్​డ్రింక్స్​లో 0.05 శాతం ఆల్కహాల్​ ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యానికి  పెద్దగా నష్టం ఉండదు. కానీ కొన్ని నకిలీ కంపెనీలు కూల్​డ్రింక్స్​లో​ ఆల్కహాల్​ను ఎక్కువశాతం వినియోగిస్తున్నాయి. కార్బొనేట్​ నీళ్లలో ఆల్కహాల్​ నింపి మార్కెట్​లోకి పంపిస్తున్నారు. ఒక సారి వీటిని  తాగినవాళ్లు మళ్లీ తాగేందుకు ఇష్టపడేలా చేస్తున్నారు.  ఇలాంటివి తాగితే 15 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.  అలాగే మార్కెట్​లో  కూల్​డ్రింక్స్​లో తీపి కోసం రసాయనాలు కలుపుతున్నారు. ఇవి నెలరోజులు వరుసగా తాగితే  టైప్​2 మధుమేహం రావడం ఖాయం. కిడ్నీ, గ్యాస్ట్రిక్​ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మహిళల్లో గర్భకోశ సమస్యలు కూడా ఎదురవుతాయి.  అలాగే చాలామంది మద్యపానం చేసే వాళ్లు కూల్​ డ్రింక్స్​ని ఆల్కహాల్​లో కలుపుకుంటారు. అలా చేస్తే లివర్​, కిడ్నీలపై అధికంగా భారం పడుతుంది. దీంతో కాలక్రమేణా అవి పనిచేయకుండా పోతాయి. కూల్​డ్రింక్స్​ తాగాలి అనిపించినప్పుడు సహజసిద్ధమైన పానీయాలను తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

క్యారెట్​ ​– క్యారెట్​లో విటమిన్–​ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, చర్మ  సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది.
కీరా –  కీరా దోసలో  నీటి శాతం అధికం. అంతేకాదు తక్కువ క్యాలరీలు ఉంటాయి. సహజంగా బరువు తగ్గాలనుకున్నా, చర్మం  ఆరోగ్యంగా ఉండాలనుకున్నా కీర దోస జ్యూస్ తాగడం మంచిది. ఇది త్వరగా జీర్ణం అవుతుంది కూడా.
మామిడి రసం– మామిడి తినకుండా, రసం​ తాగకుండా వేసవి పూర్తి కాదు.  పచ్చి మామిడి రసం ఎండవల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.
నిమ్మరసం​–  నిమ్మరసం శరీరాన్ని , చర్మాన్ని హైడ్రేట్​గా  ఉంచడమే కాదు, అధిక బరువుని కూడా తగ్గిస్తుంది.  వేసవి​ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ జ్యూస్ పక్కాగా తీసుకోవాల్సిందే.
పుదీనా రసం– పుదీనా జ్యూస్​ వేసవి వేడితో పోరాడి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
టొమాటో ​– టొమాటోలో విటమిన్​– సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, పోషక విలుకలు ​ కూడా అధికం. అందుకే  ఈ సీజన్​లో టొమాటో జ్యూస్ తాగితే మంచిది.

బరువు పెరుగుతారు
కూల్​డ్రింక్స్​ని అధికంగా తాగితే బరువు త్వరగా పెరుగుతారు.  వాటిలో ఉండే చక్కెర శరీరంలో కొవ్వుని పెంచుతుంది. ఫలితంగా డయాబెటిస్​, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.  బరువు తగ్గాలి అనుకునే వాళ్లు కూల్​డ్రింక్స్​కి దూరంగా ఉండాలి.  వాళ్లు, వీళ్లు అని కాదు ఎవరైనా సరే కూల్​ డ్రింక్స్​కి​ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.