
రాష్ట్రంలో అక్కడక్కడ వానలు..మరో మూడ్రోజులూ కురిసే అవకాశం
అయినా ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు..యూవీ కిరణాల వల్లే ఎండ మంటలు
ఇండెక్స్లో ‘11’ దాటిన కిరణాల ప్రభావం..ఉండాల్సిన రేంజ్ 0–2 లేదా 3 నుంచి 5
జూన్ రెండోవారంలో రుతుపవనాల రాక
హైదరాబాద్, వెలుగు: భానుడి ప్రతాపంతో బయటకు రావాలంటేనే జనాలు జంకారు. బయట కాలుపెడితే ఒళ్లు సుర్రుమనేది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువగానే ఉన్నా ఒళ్లు మంట మాత్రం కామన్‌గా ఉండేది. మరి, దానికి కారణమేంది? దానికి సమాధానం అతినీలలోహిత కిరణాలు. వాటినే అల్ట్రావయొలెట్ రేస్ (యూవీ) అని పిలుస్తారు. మామూలుగానే సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో యూవీ కిరణాలుంటాయి. అవి ఉండాల్సిన రేంజ్లో ఉంటే ఏం కాదు. అది పెరిగితేనే మంట పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే. యూవీ కిరణాల ప్రభావాన్ని 0 నుంచి 11+ స్కేల్‌పై కొలుస్తారు. 0–2 మధ్య ఉంటే దానితో వచ్చే ప్రమాదమేమీ ఉండదు. 3 నుంచి 5.9 మధ్య ఉండాలి. దాని వల్ల ప్రమాదం మధ్యస్తంగా ఉంటుంది. 6 నుంచి 7 దాటితే ప్రమాదం. 8–10 మధ్య ఉంటే అతి ప్రమాదం. 11 దాటితే అత్యం ప్రమాదం. ఇప్పుడు మన రాష్ట్రం అత్యంత ప్రమాదమైన జోన్లోనే ఉంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు యూవీ కిరణాల పరిమాణం 11 దాటేసిందని వాతావరణ అధికారులు చెప్పారు.
10 లేదా 11న రుతుపవనాలు..
ఇన్నాళ్లూ సెగపుట్టిస్తున్న ఎండలు గురువారం కాస్త తగ్గాయి. వాతావరణం చల్లబడింది. 47 డిగ్రీల వేడితో మంటెక్కిపోయిన రాష్ట్రం 44 డిగ్రీలకు దిగొచ్చింది. అత్యధికంగా మెదక్‌లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లాలోని జైన, ధర్మపురి ప్రాంతాల్లో 44.6 డిగ్రీలుగా ఉంది. జూన్ 10 లేదా 11వ తేదీన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ రాజారావు తెలిపారు. జూన్ 6న కేరళలోకి వస్తాయన్నారు. ద్రోణి, ఆవర్తనం, మేఘాల వల్ల పగటు, రాత్రి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినట్టు చెప్పారు. మరో నాలుగైదు రోజుల పాటు ఎండలు కాసినా వేడి తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. వడగాడ్పులు వీచే అవకాశమూ ఉందన్నారు.
ఈ ఏడాది ఎక్కువ ఉష్ణోగ్రతలు జగిత్యాల జిల్లలో నమోదయ్యాయి. రాజారామ్పల్లి, జైన, మెట్పల్లి, నేరెళ్ల, ధర్మపురి, కొల్వాయి ప్రాంతాల్లో ఎండ 47 డిగ్రీలు దాటిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మహబూబాబాద్‌లో 46 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల, ఖమ్మం, నారాయణపేట, ములుగు, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసింది. రాబోయే మూడు రోజులు పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.