పోలీసులకు కూలింగ్ గ్లాసెస్

పోలీసులకు కూలింగ్ గ్లాసెస్

సెక్రటేరియట్ లో డ్యూటీ నిర్వహించే పోలీసులకు కూలింగ్ గ్లాసెస్ ఇచ్చింది డిపార్టమెంట్. ఒక్కో కళ్లజోడు ఖరీదు 1200 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎండకాలంలో సెక్రటేరియట్ SPF సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని…. వారికి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు SPF డీజీ తేజ్ దీప్ కౌర్. డీజీ ఆదేశాలతో 210 మంది పోలీసు సిబ్బందికి కూలింగ్ గ్లాసెస్ ఇచ్చారు అధికారులు.

సెక్రటేరియట్ లో 210 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలో హైసెక్యూరిటీ జోన్ కావటంతో ఇక్కడ భద్రత ఎక్కువగా వుంటుంది. 24 గంటలపాటు సెక్రటేరియట్ కు SPF పోలీసులు కాపలా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉండటంతో డ్యూటీ చేయటం వీరికి సవాల్ గా మారింది. గతేడాది చాలామంది SPF పోలీసులు వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు సెక్రటేరియట్ లో విధులు నిర్వహించే SPF పోలీసులందరికీ కూలింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు.

SPF సిబ్బంది అంతా కళ్లజోళ్ళు పెట్టుకునే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. దీంతో సెక్రటేరియట్ లో కానిస్టేబుల్స్ నుండి పైఅధికారుల వరకు అంతా నల్ల చలువ కళ్లద్దాలు పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. ఒక్కో కళ్లజోడు విలువ 12వందల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. SPF డీజీ తేజ్ దీప్ కౌర్ ఆదేశాలతో ఉచితంగానే పంపిణీ చేసినట్లు చెప్పారు.

కళ్లజోళ్ల పంపిణీ బాగానే ఉన్నా సెక్రటేరియట్ పోలీసులకు సరైనా సదుపాయాలు కల్పించటంలేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్ గేట్ వద్దగానీ, ఏపీ సెక్రటేరియట్ గేట్ వద్దగానీ డ్యూటీ చేసేందుకు సెక్యూరిటీ బిల్డింగ్ లేదంటున్నారు సిబ్బంది. కేవలం తాత్కలిక టెంట్లు మాత్రమే ఏర్పాటు చేశారని ఆవేదన చెందుతున్నారు. వర్షం వచ్చినా.. గాలి, దుమ్ము వచ్చినా ఇబ్బందులు తప్పటంలేదని చెబుతున్నారు. మధ్యాహ్నం ఎండలో నిలబడే డ్యూటీ చేయాల్సి ఉంటుందన్నారు.

స్టేట్ లోనే హై సెక్యూరిటీ జోన్ అయినా సెక్రటేరియట్ లో పోలీసు సిబ్బందికి కనీస వసతులు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.