మేడిగడ్డ బ్యారేజీ కాపర్ వైర్ దొంగలు అరెస్ట్

మేడిగడ్డ బ్యారేజీ కాపర్ వైర్ దొంగలు అరెస్ట్

మహదేవపూర్,వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కరెంట్ స్తంభాల కాపర్ కేబుల్ వైర్ ను ఎత్తుకెళ్లిన దొంగలను మహదేవపూర్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్ పీ సూర్యనారాయణ తెలిపిన ప్రకారం .. గత జనవరిలో మేడిగడ్డ బ్యారేజ్ కుడి పక్కన కరెంట్ స్తంభాలకు ఉన్న 300 మీటర్ల కాపర్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని ఇరిగేషన్ జేఈ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద మహదేవపూర్ ఎస్ఐ పవన్ కుమార్ వాహనాల చెకింగ్ చేస్తూండగా అంబటపల్లికి చెందిన వడ్ల వినోద్ కుమార్(28), నల్ల సతీశ్(29), గుజ్జుల మహేశ్(35) అనుమానాస్పదంగా వస్తున్నారు. పోలీసు లను చూసి పారిపోయేందుకు యత్నించగా పట్టుకుని విచారించారు. గత జనవరిలో 180 కిలోలు, ఆగస్ట్ లో 120 కిలోల కాపర్ వైరు చోరీ చేసి, అమ్ముకోగా వచ్చిన డబ్బులను పంచుకున్నట్టు ఒప్పుకున్నారు.  మళ్లీ శుక్రవారం  చోరీకి వచ్చినట్టు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, బ్లేడ్ , కటింగ్ ప్లేయర్,  120 కేజీల కాపర్ వైర్,  రూ. 1. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.