మక్కలు మళ్లీ కొనేది లేదు.. ఇదే చివరిసారి..

మక్కలు మళ్లీ కొనేది లేదు.. ఇదే చివరిసారి..

రైతుల ఆందోళనలతో దిగొచ్చిన రాష్ట్ర సర్కార్​

మొన్నటివరకు కొననే కొనబోమని బెదిరింపులు

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు

పరిస్థితి చేయిదాటుతుందని చెప్పిన నిఘా వర్గాలు

మక్కల కొనుగోళ్లపై 3 గంటలపాటు సీఎం సమీక్ష

వద్దన్నా వినకుండా సాగు  చేసిన్రని రైతులపై అసంతృప్తి

మక్క రైతుల ఆందోళనలకు, ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. మొన్నటి వరకు మక్కలను అసలు కొనే ప్రసక్తి లేదని చెప్పిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని గ్రహించి కొనుగోళ్లకు ఒప్పుకున్నారు. మక్కలు కొనబోమంటూ ఇటీవల పలుసార్లు సీఎం చెప్పడంతో పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కారు. కలెక్టరేట్లను ముట్టడించారు. నాలుగు రోజుల కింద మెట్​పల్లిలో, రెండ్రోజుల కింద కామారెడ్డిలో, తాజాగా జగిత్యాలలో మహాధర్నాలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం.. ఈసారి మాత్రమే కొంటామని ప్రకటించింది.

హైదరాబాద్​, వెలుగు: ఈ ఒక్కసారికి మక్కలను ప్రభుత్వం కొంటుందని, యాసంగిలో సాగు చేస్తే కొనేది లేదని సీఎం కేసీఆర్​ చెప్పారు. ‘‘మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదని చెప్పినం. వానా కాలంలో మక్కలు వేయొద్దని కోరినం. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పసుపునకు అంతర పంటగా కొద్దిపాటి ఎకరాల్లోనే వేసుకోవాలని సూచించినం. కానీ.. ప్రభుత్వ విజ్ఞప్తిని, అగ్రికల్చర్​ ఆఫీసర్ల సూచనలను పాటించకుండా కొంత మంది రైతులు మక్కలు సాగు చేసిన్రు’’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే వినకుండా సాగు చేశారని, వాస్తవానికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదని చెప్పారు. మక్కల కొనుగోళ్లపై శుక్రవారం ప్రగతిభవన్​లో సుమారు మూడు గంటలపాటు  ఆఫీసర్లతో సీఎం కేసీఆర్​ సమీక్షించారు.  క్వింటాల్​కు రూ. 1,850 మద్దతు ధరతో ఈసారికి మక్కలు కొంటామని చెప్పారు. ఇందుకోసం గ్రామాల్లో వడ్లు కొనే సెంటర్ల దగ్గర్నే కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో నష్టాన్ని భరించడానికి సిద్ధపడి ఈసారికి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  ‘‘యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో మక్కలు సాగు చేయొద్దని రైతులను  కోరుతున్నా. ఇంత చెప్పినా సరే, మళ్లీ ఎవరైనా మక్కలు సాగు చేస్తే ప్రభుత్వ బాధ్యత ఉండదు. యాసంగిలో పండే మక్కలను ప్రభుత్వం కొనదు’’ అని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్లే మక్కలకు ధర పడిపోయిందని ఆయన ఆరోపించారు. ‘‘మక్కలపై 50 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 శాతానికి తగ్గించింది. దీనివల్లే మక్కల ధర పడిపోయింది. మక్కల ధర పడిపోవడానికి కారణమైన పార్టీ నాయకులే ఇప్పుడు రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నరు’’ అని ఆయన విమర్శించారు.

మక్కలతో గతంలోనూ నష్టపోయినం

మక్కలను కొన్నందుకు గతంలో ప్రభుత్వానికి నష్టా లు వచ్చాయని సీఎం చెప్పారు. ‘‘గత యాసంగిలో  9 లక్షల టన్నుల మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొన్నది. దీనికి రూ. 1,668 కోట్లు ఖర్చు చేసింది. ఆ మక్కలకు బయట మార్కెట్​లో ధర లేక వేలం వేస్తే రూ. 823 కోట్లే వచ్చాయి. మార్క్ ఫెడ్ కు రూ. 845 కోట్ల నష్టం వచ్చింది’’ అని చెప్పారు.

నిఘా వర్గాల రిపోర్టుతో అలర్ట్​

మొన్నటివరకు మక్కలను కొనేది లేదంటూ సీఎం కేసీఆర్​ పదే పదే  ప్రకటించారు. ‘‘మక్క పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. క్వింటాల్​కు  8, 9 వందల రూపాయలకు మించి ధర పకలట్లేదు. అదే ధరకు అమ్ముకోదలచిన రైతులే మక్కపంట వేసుకోవాలి’’ అని ఈ నెల 13న ప్రగతిభవన్​లో జరిగిన సమీక్షలో సీఎం అన్నారు. అంతకుముందు ఈ నెల 10న  రివ్యూలో కూడా ఇట్లనే చెప్పారు. ‘‘రాష్ట్రంలో పండిన మక్కలు కొనడానికి కోళ్ల వ్యాపారులు సుముఖంగా లేరు. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగం యాసంగిలో మక్కలు సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మక్కకు మద్దతు ధర లభించడం అసాధ్యం ’’ అని తెలిపారు. మక్కలు సర్కారు కొనబోదని సీఎం చెప్పడంతో రైతులు ఆందోళనలు చేపట్టారు. నిరసనలతో హోరెత్తించారు.  దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఉత్తర తెలంగాణ రైతాంగమంతా ఆందోళనలకు దిగొచ్చని నిఘా వర్గాలు ఫామ్​ హౌస్​లోని సీఎం​కు రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మక్కలు కొంటామని సర్కారు ప్రకటించింది.

For More News..

‘ఇంటర్’ అఫిలియేషన్లు నత్తనడకన