ఆదిలాబాద్: క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నేత బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించింది మంచిర్యాల ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు. ఈ కేసులో ఏ1గా బాల్క సుమన్ , ఏ2గా మూల రాజిరెడ్డిని చేర్చారు. బాల్కసుమన్ తో పాటు రాజిరెడ్డిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పోలీసులపై దాడి చేసిన కేసులో బాల్క సుమన్ ను బుధవారం (ఫిబ్రవరి 18) అరెస్ట్ చేశారు. చైర్మన్, వైస్ ఎన్నికలో ఎక్స్ ఆఫిషియో ఓటు వేసేందుకు క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళుతున్న.. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయటం..పోలీస్ సెక్యూరిటీ కోన్ విసిరేయటం వంటివి చేశారు బాల్క సుమన్.
తన అనుచరులను రెచ్చగొట్టి.. దాడి చేయించటంలో కీలక పాత్ర పోషించారు బాల్క సుమన్. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. మరో కాంగ్రెస్ కార్యకర్త సైతం గాయపడ్డాడు. క్యాతనపల్లిలో జరిగిన గొడవపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ కేసులో భాగంగా క్యాతనపల్లిలోని బాల్క సుమన్ ఇంటికి వెళ్లిన పోలీసులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. సుమన్ అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను అతడి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరికి రూల్స్ ప్రకారమే బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మంచిర్యాల ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరు పర్చారు. ఈ కేసులో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో బాల్క సుమన్ ను ఆదిలాబాద్ జిల్లా జైలుకుతరలించారు పోలీసులు.
