గ్రేటర్ హైదరాబాద్‌‌లో కరోనా కేసులు తగ్గినయ్

గ్రేటర్ హైదరాబాద్‌‌లో కరోనా కేసులు తగ్గినయ్
  • రాష్ట్రంలో రికవరీ రేట్ పెరిగింది,డెత్ రేట్ తగ్గింది
  • రోజూ 55 వేల టెస్టుల చేస్తున్నం 
  • పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు
  • వెంటిలేటర్ బెడ్స్ కొరత లేదన్న డీఎంఈ రమేశ్ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో కరోనా డెత్ రేటు కేవలం 0.59 శాతమేనని, రికవరీ రేటు జాతీయస్థాయి కంటే అధికంగా ఉందని పబ్లిక్‌‌ హెల్త్‌‌ డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ శ్రీనివాస్‌‌రావు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌ కోఠిలోని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డీఎంఈ రమేశ్‌‌రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా నుంచి 84 శాతం మంది కోలుకున్నారని, దేశంలోనే ఇది రికార్డని చెప్పారు. ప్రస్తుతం 15.42 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ప్రతి పది లక్షల జనాభాకు 79,206 టెస్టులు చేస్తున్నామని తెలిపారు. మూడున్నర కోట్ల జనాభా కలిగిన ఢిల్లీ, అసోం, ఒడిశా, హర్యానా, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ , కేరళ రాష్ట్రాల్లో ఢిల్లీ, అసోంలో మాత్రమే తెలంగాణ కంటే ఎక్కువగా టెస్టులు చేస్తున్నారని చెప్పారు.

పాజిటివ్‌‌ రేటు తగ్గింది…

రాష్ట్రంలో టెస్టులు పెంచినా పాజిటివ్‌‌ రేటు తగ్గుతోందని డాక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. మార్చిలో 1,087 టెస్టులు చేస్తే 9 శాతం, ఏప్రిల్ లో 18,098 టెస్టులకు 5 శాతం, మేలో 11,889 టెస్టులకు 15 శాతం, జూన్ లో 58,291 టెస్టులకు  28 శాతం, జులైలో 3,69,288 టెస్టులకు 13 శాతం పాజిటివ్ రేటు నమోదైందన్నారు. ఆగస్టులో 9,65,253 టెస్టులకు 7 శాతం, సెప్టెంబర్ లో 15,16,796 టెస్టులకు 4 శాతం పాజిటివ్ రేటు వచ్చినట్లు చెప్పారు. రోజూ -55 వేల టెస్టులు చేస్తున్నామని తెలిపారు. సర్కారు ఆస్పత్రుల్లో 25.4 శాతం బెడ్స్ నిండిపోగా, 74 శాతం ఖాళీగా ఉన్నాయన్నారు. 230 ప్రైవేటు ఆస్పత్రుల్లో 34.56 శాతం పడకల ఆక్యుపెన్సీ ఉందని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చికిత్స పొందుతున్నారని తెలిపారు. రెండు, మూడు జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్ అర్బన్ , నల్గొండ జిల్లాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయని.. వారం, పది రోజుల్లో అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పారు.

గ్రేటర్‌‌లో కరోనా వ్యాప్తి రేటు 0.5 శాతానికి..

గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు తగ్గాయని డాక్టర్ శ్రీనివాస్ రావు చెప్పారు. జీహెచ్ఎంసీలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి రేటు జులైలో 1.9 ఉండగా ప్రస్తుతం  0.5 శాతానికి వచ్చిందన్నారు. గ్రేటర్ లో రోజూ పదివేల టెస్టులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో లేవంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని డీఎంఈ రమేశ్‌‌రెడ్డి అన్నారు. గతంలో 1.665 బెడ్స్ కు మాత్రమే ఆక్సిజన్‌‌  ఉండేదని, ప్రస్తుతం 7,772 బెడ్స్ కు ఆక్సిజన్‌‌ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్ పై బిల్లులకు సంబంధించి 309 ఫిర్యాదులు రాగా వాటిలో 183 కంప్లైంట్లను పరిష్కరించామని తెలిపారు.