మే నెలతో పోలిస్తే 75% తగ్గిన కరోనా కేసులు

మే నెలతో పోలిస్తే 75% తగ్గిన కరోనా కేసులు
  • జూన్‌‌లో కరోనా మరణాలు 43% తగ్గినయ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోయిన నెలలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో కరోనా కేసులు 75%, మరణాలు 43% తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం వెల్లడైంది. మే నెలలో 88.82 లక్షల మందికి కరోనా సోకింది. వైరస్ వల్ల1.17 లక్షల మంది చనిపోయారు. జూన్ లో 21.87 లక్షల కేసులు నమోదు కాగా, 66,550 మంది మృతిచెందారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మే నెల మొదట్లో పీక్ స్టేజీకి వెళ్లింది. చాలారోజులు వరుసగా 4 లక్షలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. మే 7వ తేదీన ప్రపంచంలోనే అత్యధికంగా 4.14 లక్షల డైలీ కేసులు రికార్డ్ అయ్యాయి. మే నెల మధ్య నుంచే కేసులు, డెత్స్ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రెండు నెలల క్రితం రోజూ వేలాది పాజిటివ్ కేసులు వచ్చిన రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త కేసులు వందల్లోనే ఉంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో డైలీ కేసులు పదుల సంఖ్యకు కూడా పడిపోయాయి. ఇక జూన్ 1న దేశంలో యాక్టివ్ కేసులు18.95 లక్షలు ఉండగా, బుధవారం నాటికి 72 శాతం తగ్గి, 5.37 లక్షలకు పడిపోయాయి. 

కొత్త కేసులు 45 వేలు
దేశంలో కొత్తగా 45,951 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.03 కోట్లకు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ తో మరో 817 మంది చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 3.98 లక్షలకు చేరిందని తెలిపింది. ప్రస్తుతం 5.37 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇది మొత్తం కేసుల్లో 1.77 శాతమేనని పేర్కొంది. రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగిందని చెప్పింది.

గత 24 గంటల్లో 19.60 లక్షల టెస్టులు చేశామని, మొత్తం టెస్టుల సంఖ్య 41.01 కోట్లకు చేరిందని ప్రభుత్వం వివరించింది. డైలీ పాజిటివిటీ రేటు 2.34 శాతంగా నమోదైందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.69 శాతానికి తగ్గిందని ప్రకటించింది. కరోనా డెత్ రేటు 1.31 శాతంగా ఉందని తెలిపింది. కొత్తగా నమోదైన మరణాల్లో మహారాష్ట్రలో 231, తమిళనాడులో 118, కర్నాటకలో 104 రికార్డయ్యాయని చెప్పింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 1,21,804, తర్వాత కర్నాటకలో 34,929, తమిళనాడులో 32,506, ఢిల్లీలో 24,971, ఉత్తరప్రదేశ్ లో 22,577, బెంగాల్​లో 17,679, పంజాబ్  రాష్ట్రంలో 16,033 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.

ఆ జిల్లాల్లో కఠిన ఆంక్షలు పెట్టండి: కేంద్రం 
జూన్ 21 నుంచి 27 మధ్య పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా నమోదైన జిల్లాల్లో కఠిన ఆంక్షలు విధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. 14 రాష్ట్రాలు, యూటీలకు లెటర్ రాసింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాజస్థాన్, మణిపూర్, సిక్కిం, త్రిపుర, బెంగాల్, పుదుచ్చేరి, ఒడిశా, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం ప్రభుత్వాలకు కేంద్రం లెటర్ రాసింది. జిల్లా లెవెల్​లో పరిస్థితులను అంచనా వేసి, ఆ తర్వాతే ఆంక్షలు తొలగించాలని సూచించింది.