అందరి సహకారంతో కరోనా కట్టడి:కలెక్టర్ శశాంక

అందరి సహకారంతో కరోనా కట్టడి:కలెక్టర్ శశాంక

మార్చి 17న ఒకటి..మరుసటిరోజుఏడు..మరో రెండు రోజులకు రెండుకేసులు. ఇలా కేవలంమూడురోజుల వ్యవధిలోనే కరీంనగర్లో 10 కరోనాపాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇండోనేషియా నుంచివచ్చిన వైరస్ సోకడంతోనగరం ఒక్కసారిగాఉలిక్కి పడింది. అంతవరకు కళకళలాడుతూ కనిపించిన నగరం కళతప్పింది.ఈ తరుణంలో నిత్యం అన్ని విభాగాల అధికారులనుఅప్రమత్తం చేస్తూ.. అహోరాత్రులు కష్టపడి.. ప్రజలకు భరోసా ఇచ్చారు కలెక్టర్ కె. శశాంక

ముందు నుంచే అప్రమత్తంగా ఉన్నాం..

రాష్ట్ర ప్రభుత్వం ముందునుంచే మమ్మల్ని అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చే వారి పట్ల స్పెషల్ బ్రాంచీ వారు ఎప్పటికప్పడు నిఘా పెట్టారు . ఇండోనేషియా వారు వచ్చారనే సమాచారం రాగానే వారిని ట్రేస్ చేశాం. కరీంనగర్ ఆసుప్రతికి.. అక్కడి నుంచిగాంధీ ఆసుపత్రి కి 13 మందిని తరలించాం. మూడు రోజుల వ్య వధిలోనే 10 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వెంటనే పోలీసు, వైద్య ఆరోగ్య, రెవెన్యూ విభాగాలతో కలిపి యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ముందు నుంచి జాగ్రత్తవహించడం వల్లనే కేసులు తగ్గాయి.

 కంటైన్మెంట్ జోన్లు

పది కేసులు రావడంతో రాష్ట్రం మొత్తం కరీంనగర్ వైపే చూసింది. అందుకు తగినట్లుగానే రాష్ట్ర స్థాయిలో సీఎం, ఉన్నతాధికారుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఇండోనేషియా వారు తిరిగిన ప్రాంతాలను గుర్తించి.. ఆ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా చేయగలిగాం . ముకరంపుర, కశ్మీర్ గడ్డ ప్రాంతాలను నో మూవ్ మెంట్ జోన్లుగా ప్రకటించాం. సుమారుగా 3,500 కుటుంబాలు..15 వేల జనాభా ఉంది. వీరందరికీ కూరగాయలు.. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలాచేశాం. ఇప్పటికీ నిత్యం 90 మంది పోలీసులు ఈ ప్రాంతాల్లో గస్తీ కాస్తునారు.

 మొదటి క్వారంటైన్ మన దగ్గరే..

రాష్ట్రంలోనే మొదటి క్వారంటైన్ మన కరీంనగర్‌‌‌‌లోనే మొదలైంది. చెల్మెడ ఆసుప్రతిలోనే దీన్ని ఏర్పాటు చేశాం. ఇండోనేషియా వారితో ఉన్న ప్రైమరీ.. సెకండరీ కాంటాక్ట్స్ కాంటాక్ట్ అందరినీ తరలించాం. 73 మందిని చెల్మెడలో ఉంచాం. ఆ తరువాత శాతవాహన యూనివర్సిటీలోనూ క్వారంటైన్ చేశాం. టెస్టుల అనంతరం నెగిటివ్ రిపోర్టు రావడంతో 99 మందిని క్వారంటైన్ నుంచి పంపించాం. వీరంతా 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉంటారు.

మర్కజ్ తో మళ్లీ..

ఇండోనేషియా వారి నుంచి ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా మాగ్జిమమ్ పనిచేశాము. ఎప్పు డైతే మర్కజ్ వారివి బయటకు వచ్చాయో కేసులు మళ్ళీ పెరిగాయి. మొత్తం 19 ఉండగా.. ఇందులో ముగ్గురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇందులోంచి ఒకరి ద్వారా మరొకరికి వచ్చింది. హుజూరాబాద్‌‌లోనే మూడు ఉన్నాయి. మర్కజ్ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లోనూ కరీంనగర్‌‌‌‌లో అమలు చేసిన విధానాలనే పకడ్బందీగా చేస్తున్నాం. హుజూరాబాద్‌‌లో నాలుగు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాం. వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు శాయశక్తులా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.

టెలీ మెడిసిన్…

ఇప్పుడంతా లాక్ డౌన్ ఉంది. కరోనా వల్ల ఆర్ఎంపీ, పీఎంపీలను కూడా పరీక్షలు.. మందులు రాయడం చేయవద్దని చెప్పాం . ఇలాంటి స్థితిలో చాలా మంది వైద్యుల సలహాలు సూచనలు కోసం చూస్తుంటారు. వీరి కోసం ప్రత్యేకంగా టెలీ మెడిసిన్ ప్రారంభించాము. వాట్సప్ వీడియో కాల్.. కానీ.. సాధారణ కాల్ చేసైనా సమస్య ఉంటే డాకర్టలు సలహాలు ఇస్తారు. మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో కొంత మంది ప్రవర్తన వింతగా ఉంటోంది. వీరి కోసం ప్రత్యేకంగా సైక్రియాటిస్టులను ఏర్పాటు చేశాం. సుమారుగా 15 వేల మంది వలస కార్మికులకు ప్రభుత్వం తరఫున వచ్చే బియ్యం , డబ్బులు అందించాం.

ఇదే పద్ధతి పాటించాలి

నగరంలో.. గ్రామాల్లోనూ చక్కగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. నగరవాసులకు నిత్యావసర సరుకులు, కూరగాయలకు కూడా మార్కెట్ల సంఖ్య పెంచాం. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే సామాజిక దూరం పాటించాలి. వీలైనంత వరకు ఇళ్లనుంచి బయటకు రావద్దు. ఒక రోజు బయటకు వస్తే కనీసం నాలుగు రోజుల వరకు సామాన్లు తీసుకుని వెళ్లండి. పదే పదే రోజు బయటకు వస్తే ఇబ్బందిగా మారుతుంది. ఇన్ని రోజులు సహనంతో ఉన్నారు. మరికొద్ది రోజులు ఈ మహమ్మారి తగ్గే వరకు పాటించండి. పోలీసులకు సహకరించండి.