బెంగళూరు సిటీలో పట్టపగలే సినిమా రేంజ్ దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఆర్బీఐ అధికారులమని చెప్పి.. ఏటీఎంలలో క్యాష్ నింపే వాహనంలో ఉన్న కోట్ల రూపాయలు దోచుకెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మొత్తం ఏడున్నర కోట్ల రూపాయలు కొట్టేసిన దుండగులు ఎట్టకేలకు దొరికారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దొంగల ముఠా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.
బెంగళూరులో దోపిడీ చేసి పారిపోయిన దుండగులు కుప్పంలో కారు వదిలేసి వెళ్లినట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు.. కుప్పం నియోజకవర్గంలో తనిఖీలు చేపట్టారు. కుప్పం మండలంలోని కూర్మానిపల్లిలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదును స్వాధీనం చేసుకున్నారు.
శనివారం (నవంబర్ 22) దొంగలను పట్టుకున్నారు పోలీసులు. దోపిడీకి పాల్పడిన వారిలో చిత్తూరు జిల్లా కుప్పం గుడిపాల మండలానికి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు మరికొందరు కుప్పం స్థానికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు కొట్టేసిన తర్వాత పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎట్టకేలకు దొంగల ముఠా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. నగదును ఎక్కడ దాచాలో తెలియక పలు ప్రాంతాలకు మారుస్తున్న సమయంలోనే దొరికిపోయారు దోపిడీ దొంగలు.
ALSO READ : ఛార్జింగ్ గన్స్ కొట్టేస్తున్నారు..
సినిమా స్టైల్ దోపిడీ ఎలా చేశారంటే..
సిలికాన్ సిటీ బెంగళూరులో బుధవారం (నవంబర్ 19) పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినీ ఫక్కీలో దోచుకోవడం కలకలం రేపింది. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో అనుసరించింది దోపిడీ దొంగల ముఠా. కొంతదూరం వెళ్లిన తర్వాత క్యాష్ వెహికల్‌ను అడ్డగించి.. తాము సీబీఐ అధికారులమని చెప్పారు. వాహనాన్ని తనిఖీ చేయాలంటూ.. వ్యాన్‌లోని గన్‌మెన్, ఇతర సిబ్బందిని కిందకు దింపేశారు. తనిఖీ నిమిత్తం ఆఫీసుకు రావాలని నగదుతో ఉన్న వ్యాన్‌ను, ఆ వాహన డ్రైవర్‌తోనే డెయిరీ కూడలి వంతెనపైకి తీసుకెళ్లారు. అక్కడ వాహనాన్ని ఆపి.. తమ వద్ద ఉన్న పిస్టల్, కత్తులతో బెదిరించారు. వ్యాన్‌లోని రూ.7.5 కోట్ల నగదును, తమ కారులోకి మార్చుకున్నారు. ఆ తర్వాత ఉడాయించారు. చిత్తూరు జిల్లాలో వాహనాన్ని వదిలేసి పరారయ్యారు.
