న్యూఢిల్లీ: దుబాయ్ ఎయిర్ షో 2025లో ఇండియన్ ఫైటర్ జెట్ తేజస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తేజస్ విమానం కుప్పకూలిన ఈ ఘటనలో వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ మృతి చెందాడు. ఈ క్రమంలో వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ మృతికి భారత వాయు సేన (ఎయిర్ ఫోర్స్) నివాళులర్పించింది. అచంచలమైన నిబద్ధత, అసాధారణ నైపుణ్యం, అలుపెరగని విధి నిర్వహణ భావం కలిగిన అంకితభావంతో దేశానికి సేవ చేశారని కొనియాడింది.
‘‘వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ అంకితభావం కలిగిన యుద్ధ పైలట్. ఆయన అచంచలమైన నిబద్ధత, అసాధారణ నైపుణ్యం, అలుపెరుగని విధి నిర్వహణతో దేశానికి సేవ చేశారు. సేవకు అంకితమైన జీవితం ద్వారా ఆయన గౌరవప్రదమైన వ్యక్తిత్వం ఆయనకు అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి ఐఎఎఫ్ సంఘీభావంగా నిలుస్తుంది. ఆయన ధైర్యం, దేశభక్తి, గౌరవ వారసత్వాన్ని గౌరవిస్తుంది. ఆయన సేవను కృతజ్ఞతతో స్మరించుకుందాం’’ అని ఐఎఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా, భారత్కు చెందిన ప్రతిష్టాత్మక యుద్ధ విమానం తేజస్ ఫైటర్ జెట్ దుబాయ్ ఎయిర్ షోలో శుక్రవారం (నవంబర్ 21) క్రాష్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎయిర్ షో ఈవెంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోలు వైరల్గా మారాయి. ఈవెంట్కు హాజరైన ప్రేక్షకులకు సమీపంలోనే జెట్ కూలటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్దగా పేలుడు శబ్దంతో భారీ ఎత్తున పొగలు వెలువడ్డాయి.
ఏంటి తేజస్ జెట్ ప్రత్యేకత:
తేజస్ యుద్ధ విమానం ఇండియాకు ప్రతిష్టాత్మకమైనది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేయగా.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది. ఇది ఇండియాతో తయారు చేసిన తొలి ఫైటర్ జెట్ కావడం గమనార్హం.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో Mk1 రకానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ ను వాడుతున్నారు. త్వరలోనే Mk1A వేరియెంట్ ను డెలివరీ చేసేందుకు HAL ఇప్పటికే సిద్ధమైంది.
►ALSO READ | రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ హర్మాన్ సిద్ధు మాన్సా మృతి
దుబాయి లో ఏ1 మక్తూమ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు ఆధ్వర్యంలో (Al Maktoum International Airport in Dubai World Central) ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ షోలో ప్రమాదం జరగటం ఆందోళనకరంగా మారింది.
