రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ హర్మాన్ సిద్ధు మాన్సా మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ హర్మాన్ సిద్ధు మాన్సా మృతి

న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ సింగర్ హర్మాన్ సిద్ధు మాన్సా (37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన సొంత గ్రామం ఖియాలా గ్రామానికి వెళ్తుండగా పాటియాలా హైవేపై ఆయన కారు ట్రక్కును ఢీకొట్టింది. శుక్రవారం (నవంబర్ 21) అర్థరాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సిద్ధు మాన్సా అక్కడికక్కడే మరణించాడు. సిద్ధు మాన్సా ఆకస్మిక మరణం అతడి అభిమానులతో పాటు పంజాబీ సంగీత సమాజం అంతటా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సిద్ధు మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

పంజాబ్‎లో హర్మాన్ సిద్ధు మాన్సా ఫేమస్ సింగర్. ఇతడి రూరల్ బ్యాక్ గ్రౌండ్ పాటలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. మిస్ పూజాతో కలిసి 'పేపర్ యా ప్యార్' అనే బ్రేక్అవుట్ హిట్‎తో  సిద్ధు ప్రసిద్ధి చెందాడు. ఇప్పటికీ పంజాబ్‎లో ఏ శుభకార్యంలోనైనా ఈ పాట తప్పకుండా ప్లే అవ్వాల్సిందే. సింగర్‎గానే కాకుండా గేయ రచయితగా కూడా సిద్ధు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. 'కోయి చక్కర్ నాయి,' 'బేబే బాపు,' 'బబ్బర్ షేర్,' 'ముల్తాన్ VS రష్యా' వంటి పాటలు అతనికి పంజాబీ సంగీత పరిశ్రమలో మంచి పేరును తెచ్చిపెట్టాయి. తన పాటల్లో కుటుంబ బంధాలను ప్రతిబింబించేలా లేదా సామాజిక ఇతివృత్తాలతో కూడిన మెసేజ్ ఇవ్వడం ద్వారా సిద్ధుకు మంచి గుర్తింపు దక్కింది. 

►ALSO READ | Bigg Boss Telugu 9: కెప్టెన్సీ టాస్క్‌లో 'డిక్టేటర్' తనూజ ఆగం.. సుమన్‌కు మొండిచేయి.. రీతూకి కెప్టెన్సీ పట్టం!