దేవుడు పిలుస్తుండు.. మేం కూడా పెద్ద కూతురి దగ్గరికెళ్తం: మూఢనమ్మకాలకు అంబర్‎పేట్‏లో ఫ్యామిలీ బలి..!

దేవుడు పిలుస్తుండు.. మేం కూడా పెద్ద కూతురి దగ్గరికెళ్తం: మూఢనమ్మకాలకు అంబర్‎పేట్‏లో ఫ్యామిలీ బలి..!

హైదరాబాద్: హైదరాబాద్‎లోని అంబర్ పేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురితో పాటు దంపతులిద్దరు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకేసారి ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో కాలనీవాసులు షాక్‎కు గురయ్యారు. వివరాల ప్రకారం.. శ్రీనివాస్,  విజయలక్ష్మి దంపతులు కూతురు శ్రావ్యతో కలిసి బాగ్ అంబర్ పేటలోని మల్లికార్జున్ నగర్‎లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుర్లు కాగా ఇటీవలే పెద్ద కూతురు సూసైడ్ చేసుకుంది. 

కూతురు చనిపోవడంతో రామ్‎నగర్ నుంచి అంబర్ పేట్‎కు షిఫ్ట్ అయ్యారు. ఏమైందో తెలియదు కానీ శనివారం (నవంబర్ 22) దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి, కూతురు శ్రావ్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

క్లూస్ టీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి..? ఏమైనా వివాదాలు ఉన్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. శ్రీనివాస్ ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడటానికి మూఢ నమ్మకాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల శ్రీనివాస్ పెద్ద కూతురు చనిపోయిందని.. అప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్‎లో ఉందని చెప్పారు. దేవుడు పిలుస్తున్నాడని.. తాము కూడా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తామని అనేవారని స్థానికులు చెబుతున్నారు.

మూఢ నమ్మకంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూఢ నమ్మకాలతోనే చనిపోయారా..? మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మూఢ నమ్మకాలతో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.