మెల్బోర్న్: పెర్త్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోక విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా.. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగి జట్టుకు వేగంగా గెలుపును అందించాడు. ఉస్మాన్ ఖవాజాకు గాయం కావడంతో ఓపెనర్‌గా బరిలోకి దిగినహెడ్ ఆడేది టెస్ట్ కాదు వన్డే అన్నట్లుగా రెచ్చిపోయాడు.
ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ 83 బంతుల్లోనే 123 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తన అద్భుతమైన సెంచరీతో 123 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు హెడ్. 69 బంతుల్లో సెంచరీ చేసిన హెడ్.. టెస్ట్ నాలుగో ఇన్సింగ్స్‌లో అత్యంత వేగవంతమైన శతకం బాదిన తొలి ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ గిల్బర్ట్ జెస్సోప్ పేరిట ఉండేది. 1902లో ఆస్ట్రేలియాపై గిల్బర్ట్ జెస్సోప్ 76 బంతుల్లో సెంచరీ చేశాడు.
పెర్త్ టెస్ట్ నాలుగో ఇన్సింగ్స్‌లో కేవలం 69 బంతుల్లోనే సెంచరీ చేసిన హెడ్.. గిల్బర్ట్ జెస్సోప్ 123 ఏళ్ల రికార్డ్‌ను తుడిచిపెట్టాడు. దీంతో పాటు మరో రికార్డ్ కూడా సాధించాడు. టెస్టుల్లో ఛేజింగ్‌లో అత్యధిక బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ (148.19)తో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో పేరిట ఉండేది. అతను 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో 147.82 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ బాదాడు. పెర్త్ టెస్ట్‌లో 148.19 స్ట్రైక్ రేట్‌తో శతకొట్టిన హెడ్ బెయిర్ స్టో రికార్డును బద్దలు కొట్టాడు.
టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేసిన ఆటగాళ్లు:
- 148.19 - ట్రావిస్ హెడ్ vs ఇంగ్లాండ్, 2025*
- 147.82 - జానీ బెయిర్‌స్టో vs NZ, 2022
- 132.14 - నాథన్ ఆస్టిల్ vs ENG, 2002
- 128.42 - షాహిద్ అఫ్రిది vs వెస్టిండీస్, 2005
