అమెరికాలో కరోనా డెత్స్ తొమ్మిది లక్షలు

అమెరికాలో కరోనా డెత్స్ తొమ్మిది లక్షలు
  • కేసులు తగ్గుతున్నా డెత్స్ తగ్గుతలే
  • రోజూ సగటున 2,400 మంది చనిపోతున్నరు
  • యూఎస్‌‌లో ఇప్పటిదాకా 64% మందికే ఫుల్ వ్యాక్సిన్

వాషింగ్టన్: హెల్త్.. వెల్త్.. ఇలా అన్నింటిలో అగ్రదేశమైన అమెరికా.. కరోనా కోరల నుంచి మాత్రం బయటపడలేదు. గ్యాప్ ఇచ్చి.. గ్యాప్ ఇచ్చి.. రంగులు మార్చుకుని కమ్మేస్తోంది వైరస్. కరోనా వల్ల ఇప్పటిదాకా అమెరికాలో 9 లక్షల మంది చనిపోయారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడం, చాలా మంది వ్యాక్సిన్లు వేసుకోకపోవడంతో.. కేవలం 51 రోజుల్లోనే లక్ష మందికి పైగా చనిపోయారు. ఈ లెక్కలను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ బయటపెట్టింది. రెండేళ్లలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య.. ఇండియానాపొలిస్, శాన్ ఫ్రాన్సిస్కో, చార్లొట్టే నగరాల జనాభా కంటే ఎక్కువ అని తెలిపింది. 

ఏప్రిల్‌‌కల్లా మరో లక్ష
‘‘నిజంగా ఇది చాలా పెద్ద సంఖ్య. ‘కరోనా వల్ల 9 లక్షల మంది చనిపోతారు’ అని రెండేళ్ల కిందట చెబితే అమెరికన్లు ఎవరూ నమ్మేవాళ్లు కాదు. వ్యాక్సిన్లకు అనుమతి లభించిన తర్వాతే ఎక్కువ మరణాలు సంభవించాయి” అని బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ అఖిలేశ్ కె.ఝా అన్నారు. ‘‘మా దగ్గర మెడికల్ సైన్స్ ఉంది.. కానీ సోషల్ సైన్స్‌‌లో మేం ఫెయిల్ అయ్యాం. టీకాలు వేయించుకునే విషయంలో ప్రజలకు సాయం చేయడంలో, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో, ఈ వ్యవహారాన్ని రాజకీయం కాకుండా చూసుకోవడంలో మేం ఫెయిల్ అయ్యాం” అని చెప్పారు. ఏప్రిల్‌‌ కల్లా మరో లక్ష మంది చనిపోయే ప్రమాదం ఉందని, డెత్స్ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా భారాన్ని మోయలేం.. వ్యాక్సిన్లు వేసుకోండి: బైడెన్
శుక్రవారం(అక్కడి టైం ప్రకారం) రాత్రి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘‘రెండేళ్ల తర్వాత కూడా.. ఎమోషనల్, ఫిజికల్, సైకలాజికల్‌‌గా కరోనా భారాన్ని మోయడం చాలా కష్టమని నాకు తెలుసు. అమెరికన్లకు మళ్లీ చెప్తున్నా వ్యాక్సిన్లు వేసుకోండి” అని కోరారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 22.5 కోట్ల మందికి కనీసం సింగిల్ డోసు వేసినట్లు చెప్పారు. వ్యాక్సిన్ల వల్ల కనీసం 10 లక్షల మంది అమెరికన్ల ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. కాగా, అమెరికాలో ఇప్పటిదాకా కేవలం 64 శాతం (21.2 కోట్లు) మంది మాత్రమే ఫుల్‌‌గా వ్యాక్సిన్ వేసుకున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ వెల్లడించింది. డిసెంబర్‌‌‌‌ 14 నాటికి డెత్స్ సంఖ్య 8 లక్షలకు చేరగా, తర్వాత 51 రోజులకే లక్ష మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం డెత్స్ సంఖ్య 9,24,530కి చేరినట్లు ‘వరల్డో మీటర్’ లెక్కలు చెబుతున్నాయి.

కేసులు తగ్గినా..
జనవరిలో రెండు, మూడు వారాల్లో రోజుకు 8 లక్షల నుంచి 9 లక్షల దాకా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 3 లక్షల దాకా నమోదవుతున్నాయి. రెండు వారాల నుంచి 49 రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య తగ్గుతోంది. కానీ డెత్స్ తగ్గడం లేదు. ప్రస్తుతం సగటున 2,400 మంది రోజూ చనిపోతున్నారు. ఒమిక్రాన్‌‌ వ్యాప్తి ముగియబోతోందని పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ కొత్త వేరియంట్లు వస్తే పరిస్థితి మళ్లీ ప్రమాదకరంగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.