ఐపీఎల్​ కు కరోనా దెబ్బ

V6 Velugu Posted on May 04, 2021

  • కేకేఆర్‌ బౌలర్లు చక్రవర్తి, వారియర్​కు పాజిటివ్​
  • కోల్​కతా–బెంగళూరు మ్యాచ్​ పోస్ట్​పోన్​
  • మరికొన్ని మ్యాచ్‌లపైనా ఎఫెక్ట్‌    
  • సీఎస్​కే  కోచ్‌ బాలాజీకి కూడా పాజిటివ్‌ 
  • ఢిల్లీ  గ్రౌండ్‌ స్టాఫ్​లో ఐదుగురికి   లీగ్‌ కొనసాగుతుందన్న బోర్డు

సాఫీగా సాగుతున్న ఐపీఎల్​–14లో కరోనా కలకలం..! అత్యంత కట్టుదిట్టమైన బయో బబుల్​లో ఉన్న క్రికెటర్లను వైరస్​ వెంటాడింది.! కోల్​కతా నైట్‌రైడర్స్‌ ప్లేయర్లు ​వరుణ్​చక్రవర్తి, సందీప్​ వారియర్ ​పాజిటివ్​గా తేలారు.  ఫలితంగా సోమవారం జరగాల్సిన కోల్​కతా– బెంగళూరు మ్యాచ్​ను బీసీసీఐ పోస్ట్​పోన్​ చేసింది. ఇద్దరు ప్లేయర్లతో కాంటాక్ట్​ అయిన ప్రతి ఒక్కరికి టెస్టులు చేస్తున్నారు..!  మరోవైపు సీఎస్​కే టీమ్‌ బౌలింగ్​ కోచ్ ​లక్ష్మీపతి బాలాజీతో పాటు ఢిల్లీ స్టేడియంలో ఐదుగురు  గ్రౌండ్‌ స్టాఫ్‌ పాజిటివ్‌గా తేలారు..!  అటు అహ్మదాబాద్‌లోని కోల్‌కతా ఫ్రాంచైజీ, ఇటు ఢిల్లీ బేస్‌గా ఉన్న చెన్నై క్యాంప్‌లో కరోనా కేసులు వెలుగు చూడడంతో లీగ్‌ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి..! కోల్‌కతా టీమ్‌ మొత్తం ఆరు రోజుల క్వారంటైన్‌లోకి వెళ్లగా.. సీఎస్‌కే కూడా అదే బాటలో ఉంది..! ఈ లెక్కన మరికొన్ని మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేయాల్సిన పరిస్థితి రావొచ్చు..!  ఈ పరిణామాలతో లీగ్‌ను నిలిపివేయాలనే డిమాండ్లు వస్తున్నాయి..! ఇప్పటికైతే లీగ్‌ కొనసాగుతుందని బీసీసీఐ చెబుతున్నా.. మున్ముందు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది..!

న్యూఢిల్లీ: భారీ భద్రత.. పక్కా సేఫ్టీ మెజర్స్​.. అనుక్షణం బయో బబుల్​లోనే జీవితం.. బయటకు వెళ్లాలన్నా.. వేరే వారిని కలవాలన్నా.. హై సెక్యూరిటీ ప్రొటోకాల్. తినే తిండి దగ్గర్నించి.. వేసుకునే షూస్​ వరకు.. ప్రతిక్షణం శానిటైజేషన్​ చేసే సిబ్బంది... ఇలా చెప్పుకుంటూపోతే ఐపీఎల్​–14 కోసం బీసీసీఐ, ఐపీఎల్, ఫ్రాంచైజీలు తీసుకుంటున్న జాగ్రత్తలు ఎన్నో. అయినా.. మెగా లీగ్​లోకి కరోనా ఎంటర్​ అయ్యింది. ఇప్పటికే దేశాన్ని ఊపేస్తున్న  వైరస్.. ఇప్పుడు అత్యంత సురక్షితంగా ఉండే  క్రికెటర్లకు కూడా సోకింది. కోల్​కతా నైట్​ రైడర్స్ ​స్పిన్నర్​  వరుణ్​ చక్రవర్తి, పేసర్​  సందీప్​ వారియర్స్​ వైరస్​ బారిన పడ్డారు. దీంతో సోమవారం బెంగళూరుతో జరగాల్సిన కోల్​కతా మ్యాచ్​ను ఐపీఎల్​ గవర్నింగ్​ కౌన్సిల్​ పోస్ట్​పోన్​ చేసింది.  గత​ నాలుగు రోజుల్లో భాగంగా నిర్వహించిన మూడో​ ఆర్టీ–పీసీఆర్​ టెస్ట్​లో వరుణ్​, సందీప్​కు వైరస్​ సోకినట్లు తేలింది. ఈ ఇద్దర్ని ఐసోలేషన్​లో ఉంచిన ఫ్రాంచైజీ.. టీమ్​ మెంబర్స్​ అందరికి పరీక్షలు నిర్వహించింది. కానీ వాళ్లకు నెగెటివ్​ రిపోర్ట్​ రావడంతో ఊపిరి పీల్చుకుంది.  ‘ఇద్దరు ప్లేయర్లను ఐసోలేషన్​లో ఉంచారు. మెడికల్​ టీమ్​ ప్రతిక్షణం వాళ్ల హెల్త్​ను మానిటర్​ చేస్తున్నది. కేకేఆర్​ టీమ్​ మొత్తానికి రోజువారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిగతా వాళ్లలో కూడా ఎవరికైనా వైరస్​ సోకితే వెంటనే చర్యలు తీసుకునేందుకు ఈ టెస్టింగ్​ను చేపట్టారు. గత 48 గంటల్లో ఇద్దరు పాజిటివ్​ ప్లేయర్లతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కర్ని మెడికల్​ టీమ్​ అబ్జర్వ్​ చేస్తున్నది. వారందరి శాంపిల్స్​ను కలెక్ట్​  చేస్తున్నది. ప్రతి ఒక్కరి హెల్త్​ను సేఫ్​గా ఉంచేందుకు బీసీసీఐ, కేకేఆర్​ ఫ్రాంచైజీ అన్ని చర్యలు తీసుకుంటున్నది’ అని ఐపీఎల్​ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే పోస్ట్​పోన్​ అయిన మ్యాచ్​ను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై  క్లారిటీ ఇవ్వలేదు. కాగా, వరుణ్, సందీప్​ ఆరోగ్యంగా ఉన్నారని, ఈ నెల 8న జరిగే తమ తర్వాతి మ్యాచ్​లో కేకేఆర్​ ఆడుతుందని టీమ్​ సీఈవో వెంకీ మైసూర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ​ 
హాస్పిటల్​లోనే సోకిందా?
గురువారం ఢిల్లీతో మ్యాచ్​లో ఆడిన వరుణ్​ భుజానికి గాయమైంది. దీంతో బబుల్​ను వదిలిపెట్టి అఫీషియల్​ గ్రీన్​ చానెల్​లోని హాస్పిటల్​కు  తరలించి స్కానింగ్​ నిర్వహించారు. ఈ టైమ్​లోనే వైరస్​ సోకినట్లు ఐపీఎల్​ వర్గాలు వెల్లడించాయి. వరుణ్​ నుంచి వారియర్​కు అంటుకుందేమోనని అనుమానిస్తున్నారు. గ్రీన్​ చానెల్​ ప్రొటోకాల్​ ప్రకారం కంప్లీట్​ శానిటైజ్​ చేసిన వెహికల్​లో క్రికెటర్​ను తీసుకెళ్తారు. హాస్పిటల్​లో కూడా ప్రతి ఒక్కరూ పీపీఈ కిట్స్​ను వాడుతారు. అదే వెహికల్​లో ప్లేయర్​ను మళ్లీ బబుల్​లోకి తీసుకొస్తారు. అయినప్పటికీ వరుణ్​కు వైరస్​ సోకడంతో బీసీసీఐ ఉలిక్కిపడింది. అహ్మదాబాద్​లో కోల్​కతా బస చేసిన హోటల్​ను మూడు రోజుల పాటు కంప్లీట్​ శానిటైజ్​ చేయాలని ఆదేశించింది. అన్ని జట్ల ప్లేయర్లకు డైలీ టెస్టులు చేయాలని డిసైడైంది. 
ఢిల్లీ క్యాపిటల్స్‌ పరిస్థితి ఏంటి?
ఏప్రిల్‌ 29న కోల్​కతా.. ఢిల్లీతో లాస్ట్​ మ్యాచ్​ ఆడింది. దీంతో ఢిల్లీ ప్లేయర్లకు కూడా ఏమైనా వైరస్​ సోకిందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీంతో డీసీ ప్లేయర్లంతా ఐసోలేషన్​లోకి వెళ్లారు. ‘ఢిల్లీ టీమ్​లోని ప్రతి ఒక్కరికి టెస్ట్​లు నిర్వహించాలని ఆదేశించాం. వరుణ్, వారియర్​కు కాంటాక్ట్​లో ఉన్న ప్రతి ఒక్కర్ని ముందస్తుగా ఐసోలేట్​ చేసి టెస్ట్​లు చేస్తున్నాం’ అని ఐపీఎల్​ వర్గాలు వెల్లడించాయి.   
కోట్లా గ్రౌండ్ స్టాఫ్​కు వైరస్​.. ఢిల్లీ లెగ్ మ్యాచ్​లపై నీలి నీడలు
ఢిల్లీ ఫిరోజ్​షా కోట్ల మైదానంలో జరిగే మ్యాచ్​లపై నీలి నీడలు కమ్ముకున్నాయి.  ఎందుకంటే ఇక్కడి గ్రౌండ్​ స్టాఫ్‌లో ఐదుగురికి పాజిటివ్​ వచ్చింది.  ఇదే గ్రౌండ్‌లో ఆదివారం హైదరాబాద్​, రాజస్తాన్​ మ్యాచ్ జరిగింది. పాజిటివ్‌ వచ్చిన స్టాఫ్‌.. పలువురు ప్లేయర్లు, స్టాఫ్​తో కాంటాక్ట్​ అయినట్టు వార్తలు వచ్చినా.. ఆ ఐదుగురు ఆ రోజు డ్యూటీలోనే లేరని డీడీసీఏ చీఫ్‌ రోహన్‌ జైట్లీ చెప్పారు. ఇదే గ్రౌండ్‌లో మంగళవారం  ముంబై– సన్‌రైజర్స్‌ మ్యాచ్​ షెడ్యూల్​ ప్రకారమే జరుగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

బాలాజీకి పాజిటివ్‌‌పై ఆందోళన
బయో బబుల్‌‌లో ఉన్న సీఎస్‌‌కే బౌలింగ్‌‌ కోచ్‌‌ లక్ష్మీపతి బాలాజీ పాజిటివ్‌‌గా తేలడం సర్వత్రా ఆందోళన కలుగుతోంది. తొలుత చెన్నై టీమ్​లో  బాలాజీ సహా ముగ్గురు మెంబర్స్​ పాజిటివ్​గా తేలారు. సీఈవో కాశీ విశ్వనాథన్, టీమ్​ బస్​ క్లీనర్​కు  కూడా వైరస్​ సోకినట్లు ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. దాంతో,  సీఎస్​కే ప్రాక్టీస్​ సెషన్​ను రద్దు చేసుకుని హోటల్​కే పరిమితమైంది. మిగతా ప్లేయర్లు, స్టాఫ్​ మాత్రం నెగెటివ్​గా తేలారు. 48 గంటల ముందు నిర్వహించిన ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ల్లో బాలాజీకి పాజిటివ్​ వచ్చింది.  కానీ, సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన యాంటీజెన్​ టెస్ట్​లో మాత్రం ముగ్గురికీ నెగెటివ్​ రిపోర్ట్​ రావడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కచ్చితమైన ఫలితం కోసం మరో రెండు ఆర్టీపీసీఆర్‌‌ టెస్టులు చేయగా.. బాలాజీ, బస్‌‌ క్లీనర్‌‌ పాజిటివ్‌‌గా తేలారు. దాంతో, బాలాజీని ఐసోలేషన్‌‌కు తరలించారు.  అతను ముంబై ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో సీఎస్‌‌కే డగౌట్‌‌తో పాటు ఆ టీమ్‌‌ డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లో ఉన్నాడు. సహజంగానే  ఇరు జట్ల ప్లేయర్లతో కాంటాక్ట్‌‌ అయ్యాడు. దాంతో, ఇటు సీఎస్​కేతో పాటు ముంబై ఆటగాళ్లు కూడాఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సీఎస్‌‌కే.. ఢిల్లీలో ఉండగా ఆ టీమ్‌‌ ప్లేయర్లను హోటల్‌‌ రూమ్‌‌కు పరిమితం చేశారు. సీఎస్‌‌కే బుధవారం రాజస్తాన్‌‌ రాయల్స్‌‌తో పోటీ పడాల్సి ఉంది. 

Tagged corona effect, IPL matches, , ipl today, ipl 2021 tourney, ipl cricket, players positive, COVID-19 Effect

Latest Videos

Subscribe Now

More News