సాగర్ ఉప ఎన్నికకు కరోనా భయం

V6 Velugu Posted on Apr 08, 2021

  • ఎన్నికల ప్రచారానికి గుంపులు గుంపులుగా పార్టీ లీడర్లు, క్యాడర్
  • ఫిజికల్ డిస్టెన్స్ పాటించట్లే.. మాస్కులు వాడట్లే
  • ప్రచారంలో పాల్గొన్న పలువురికి పాజిటివ్
  • పబ్లిక్ మీటింగులు పెడ్తే కంట్రోల్ కష్టమే

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికకు కరోనా సెకండ్వేవ్ భయం పట్టుకుంది. మండలాల ఇన్చార్జీలుగా ప్రచారం చేస్తున్న కొందరు టీఆర్ఎస్ లీడర్లకు, వారి వెంట వచ్చిన ఫాలోయర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. మాడ్గులపల్లి మండల ఇన్చార్జి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డి సోదరుడితోపాటు మరికొందరు కార్యకర్తలకు పాజిటివ్ కన్ఫర్మ్ అయ్యింది. వారు ప్రచారాన్ని నిలిపివేసి ట్రీట్మెంట్కోసం నిజామాబాద్ వెళ్లారని చెప్తున్నారు. దీంతో  మిగితా ఏరియాల్లో ప్రచారం చేస్తున్న లీడర్లు అలర్టయ్యారు. సాగర్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు వాక్సిన్ తీసుకున్నారు. కొందరు లీడర్లయితే ప్రచార షెడ్యూల్ మార్చుకుంటున్నారు. పొద్దున, సాయంత్రం ఒకటిరెండు ఊర్లు తిరిగి ఎక్కువ టైమ్ రెస్ట్ తీసుకుంటున్నారు. 
పోలీసులు చెప్తున్నా.. 
ఎన్నికల ప్రచారం చేస్తున్న లీడర్లు, క్యాడర్ మాస్కులు పెట్టుకునేలా చూడాలని, ఈమేరకు వారికి అవగాహన కల్పించాలని డీఐజీ రంగనాథ్ సాగర్లో డ్యూటీ చేస్తున్న పోలీసు ఆఫీసర్లకు సూచించారు. కానీ ఎక్కడా కరోనా రూల్స్పాటించడం లేదు. మీటింగ్లకు వస్తున్న జనాన్ని పోలీసులు కూడా  కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒత్తిడి తెస్తే పొలిటికల్ గా సమస్యలు వస్తాయన్న భయంతో పోలీసులు పట్టించుకోవడం లేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన చాలామంది పోలీసులు ఫస్ట్ వేవ్లో కరోనా బారిన పడ్డారు. దాంతో ఈసారి కరోనా కోరల్లో చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. గుంపులుగా ఉన్న జనాల విషయంలో అంటీముట్టనంటూ ఉంటున్నారు. 
పబ్లిక్ మీటింగ్‌ల భయం
సాగర్ ఎన్నికల్లో భాగంగా పార్టీలు పబ్లిక్ మీటింగ్లకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నెల 15న సీ ఎం కేసీఆర్ హాలియాలో సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా స్టార్ క్యాంపేయినర్లతో త్వరలో మీటింగులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. కేసీఆర్ సభకు భారీగా పబ్లిక్ను  తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు దీటుగానే కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ సభలకు జనసమీకరణ చేయాలని భావిస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న టైమ్లో పెద్ద సభలు పెడితే ప్రమాదమని, ఎక్కువమంది వస్తే జాగ్రత్తలు పాటించడం అసాధ్యమని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. 
కేసులు పెరుగుతున్నయ్
నల్గొండ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతోంది. రెండు, మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు చెప్తున్నారు. జిల్లాలో బుధవారం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 785కి చేరింది. దీంట్లో మార్చిలో 683 కేసులు నమోదుకాగా, ఏప్రిల్లోనే 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 45 ఏళ్లు నిండినవారు సుమారు రెండు లక్షల మంది ఉన్నా, వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకు 45 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్కులు ఏడు వేల మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారు. 

Tagged Telangana, coronavirus, nagarjuna sagar, Sagar Byelection, no mask, Election Campaign, covid rules, Physical Distance, Public meetings

More News