అంత్యక్రియలైన 5 రోజులకు కరోనా సోకినట్లు గుర్తింపు

అంత్యక్రియలైన 5 రోజులకు కరోనా సోకినట్లు గుర్తింపు

భయాందోళనలో బంధువులు, గ్రామస్తులు

వ్యక్తి చనిపోయి అంత్యక్రియలు జరిగిన 5 రోజుల తర్వాత ఆ వ్వక్తికి కరోనా సోకినట్లు వైద్యులు దృవీకరించారు. దాంతో అంత్యక్రియలకు హాజరైన గ్రామస్తులు, బంధువులు భయాందోళనలో పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన విజయాభాయి (50) అనారోగ్యంతో ఆర్ఎంపీ వద్దకు వెళ్లి చూపించుకుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో.. కుటుంబసభ్యులందరూ కలిసి కరోనా శాంపిల్స్ ఇవ్వడానికి ఈ నెల 8వ తేదీన చార్మినార్ కోవిడ్ కేంద్రానికి వెళ్లారు. కానీ, అక్కడ టోకెన్లు లేకపోవడంతో.. కేవలం అనారోగ్యంగా ఉన్న విజయాభాయి శాంపిల్ మాత్రమే తీసుకున్నారు. ఆ తర్వాత విజయాభాయి కుటుంబసభ్యులతో ఇంటికి చేరుకుంది. అయితే అదే రోజు రాత్రి విజయాభాయి ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే మలక్ పేట యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఆస్పత్రి సిబ్బంది ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. దాంతో అక్కడినుంచి బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి తీసుకెళ్లగా వాళ్లు కూడా నిరాకరించారు. చేసేదేం లేక అక్కడి నుండి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. వాళ్లు కూడా చేర్చుకోలేమని చెప్పడంతో.. అటు నుంచి తెల్లవారుజామున 4 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రులన్నీ తిరిగితిరిగి ఉస్మానియాకు చేరుకునే సరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి.. ఉదయం 8 గంటలకు మరణించింది. అక్కడి వైద్యులు ఆమె మరణాన్ని దృవీకరించారు.

మృతదేహానికి కరోన టెస్టులు చేసి.. టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మృతదేహాన్ని తీసుకెళ్తామని మృతురాలి బంధువులు కోరారు. అయితే వైద్యులు మాత్రం కరోనాలాంటిదేమి లేదని చెప్పి.. మరణానికి గల కారణాన్ని రాసి మృతదేహాన్ని వారికి అప్పగించారు. దాంతో బంధువులు అదే రోజు గ్రామంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. అంత్యక్రియలు ముగిసిన 5 రోజుల తర్వాత అంటే జూలై 13న చార్మినార్ ఆస్పత్రి నుంచి విజయాభాయికి కరోనా సోకినట్లు రిపోర్టు వచ్చింది. ఈ విషయాన్ని ఆశా వర్కర్లు, మెడికల్ సిబ్బంది.. విజయాభాయి బంధువులకు తెలియజేశారు. దాంతో అంత్యక్రియలలో పాల్గొన్న బంధువులు, గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు గురవుతూ.. తమకు కూడా పరీక్షలు చేయాలని కోరుతున్నారు.

For More News..

కేసీఆర్ కు ఆస్పత్రులు సందర్శించే టైం కూడా లేదు

బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేది.. హత్యా? ఆత్మహత్యా?

రాజస్థాన్‌‌లో గెహ్లాట్, పైలట్‌‌.. నువ్వా? నేనా?

లాక్డౌన్ పూర్తిగా ఎత్తేద్దాం: కేంద్రం.. మళ్లీ పెడదాం : రాష్ట్రాలు