నారాయణపేట జిల్లా: కరోనా మహమ్మారి అమాయకుడైన ఓ వ్యక్తి నిండు ప్రాణాలు బలితీసుకుంది. చికిత్స తీసుకుంటే నయం అవుతుందనే విషయంలో అవగాహన లేక.. సామాజిక దూరం పాటించడం అంటే వెలివేసినట్లు అవమానంగా భావించిన ఓ వ్యక్తి నిండు ప్రాణాలను చేజేతులా తీసుకున్నాడు. కరోనాతో అనారోగ్యంపాలై భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన కుటుంబ సభ్యులు రెండు రోజులపాటు ఇంట్లోనే ఉన్నా శవం దగ్గరకు వెళ్లేందుకు సాహసించకుండా మౌనంగా ఉండిపోయారు. చుట్టుపక్కల వారు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చే వరకు ఈ ఘటన బయటకు పొక్కలేదు. నారాయణపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
దామరగిద్ద మండలం, గడ్డిమున్కంపల్లి గ్రామానికి చెందిన ఉలిగుండం నర్సప్ప (48) కరోనా సోకడంతో తీవ్ర మనోదవేనకు గురై తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సప్పకు ఐదు రోజుల కిందట కరోనా సోకింది. చికిత్స విషయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంటా బయటా పరిస్థితిని చూసి చలించిపోయాడు. మనోవేదన భరించలేక రెండు రోజుల క్రితం తన ఇంటిలోనే ఉరి వేసుకొని చనిపోయాడు. కరోనా సోకిన విషయం తెలిసినప్పటి నుంచి నర్సప్ప ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. వారు కూడా అతనికి దూరంగా మసలుకోవడంతో వెలివేసినట్లు ఆత్మన్యూనతకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కరోనా భయంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేశారు. రెండు రోజులు కావడంతో చుట్టుపక్కల వారు వచ్చి అభ్యంతరం చెప్పడంతో పీపీఈ కిట్లు ఇస్తే శవాన్ని తీస్తామని చెప్పడంతో గ్రామస్తులు షాక్ కు గురై వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయి అలాగే ఉండిపోవడం గ్రామంలో చర్చనీయాంశం అయింది. అవగాహన కల్పించక పోవడం వలన ఇలాంటి సంఘటనలు జరగటానికి కారణం అవుతున్నాయి అని గ్రామస్థులు తెలిపారు.
