హెల్త్​ మినిస్టర్ ఈటెల పేషీలో ఏడుగురికి కరోనా

హెల్త్​ మినిస్టర్ ఈటెల పేషీలో ఏడుగురికి కరోనా

హైదరాబాద్, వెలుగుహెల్త్​ మినిస్టర్​ ఈటల రాజేందర్‌‌ పేషీలోనే ఏడుగురికి కరోనా సోకింది. ఇద్దరు పీఏలు, ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు గన్​మెన్లకు ఒకేసారి పాజిటివ్ రావడంతో మంత్రి కార్యాలయాన్ని శానిటైజ్ చేయించారు. మిగిలిన సిబ్బంది కూడా టెస్టులు చేయించగా.. అందరికీ నెగెటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మంత్రి ఈటల కూడా టెస్టు చేయించుకోగా.. నెగెటివ్‌‌ వచ్చినట్టు తెలిసింది.

వెంటిలేటర్లపై 1,630 మంది

సర్కారు లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1.67 లక్షలు దాటింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు 50,634 మందికి టెస్టులు చేస్తే.. 2,043 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్​ డిపార్ట్​మెంట్​ బులెటిన్​లో వెల్లడించింది. అందులో గ్రేటర్‌‌‌‌  హైదరాబాద్‌‌ పరిధిలో 314, జిల్లాల్లో 1,729 కేసులు నమోదయ్యాయని తెలిపింది. జిల్లాల్లో అత్యధికంగా రంగారెడ్డి (నాన్‌‌ జీహెచ్‌‌ఎంసీ) 174, మేడ్చల్ మల్కాజ్‌‌గిరి (నాన్‌‌ జీహెచ్‌‌ఎంసీ) 144, నల్గొండ 131, సిద్దిపేట 121, కరీంనగర్‌‌‌‌ 114, వరంగల్ అర్బన్ 108, ఖమ్మం 84, మహబూబాబాద్‌‌ 74, సంగారెడ్డి 71, నిజామాబాద్‌‌ 65, సూర్యాపేట్‌‌ జిల్లాలో 51 కేసులు.. మిగతా జిల్లాల్లో 50 కంటే తక్కువ కేసులు వచ్చాయని పేర్కొంది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షా 67 వేల 46కు చేరిందని బులెటిన్​లో తెలిపారు. ఇందులో 1,35,357 మంది కోలుకోగా.. 30,673 మంది యాక్టివ్  పేషెంట్లు ఉన్నారు. యాక్టివ్ పేషెంట్లలో 24,081 మంది హోం, ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్‌‌లో ఉండగా.. మరో 6,592 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌‌ దవాఖాన్లలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ఇందులో 3,290 మంది ఆక్సిజన్‌‌పై, 1,630 మంది సీరియస్‌‌ కండీషన్‌‌లో వెంటిలేటర్‌‌ ‌‌పై ఉన్నారు. కరోనాతో గురువారం మరో 11 మంది చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య 1,016కు చేరిందని బులెటిన్​లో తెలిపారు. గురువారం చేసిన టెస్టులతో కలిపి మొత్తం టెస్టుల సంఖ్య 23 లక్షల 79 వేల 950కి పెరిగిందని పేర్కొన్నారు.

ఏపీలో 8,096 కేసులు

అమరావతి, వెలుగు: ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 74,710 శాంపిల్స్ టెస్టు చేయగా 8,096 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 9 వేల 558కి చేరింది. కరోనాతో శుక్రవారం ఒక్కరోజే 67 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 5,244కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 49 లక్షల 59 వేల 81 శాంపిల్స్ టెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​
వెల్లడించింది.