లాక్ డౌన్ లో సొంతూరికి: వంద‌ల కిలోమీట‌ర్లు న‌డుస్తున్న వ‌లస కూలీలు

లాక్ డౌన్ లో సొంతూరికి: వంద‌ల కిలోమీట‌ర్లు న‌డుస్తున్న వ‌లస కూలీలు

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ మ‌హ‌మ్మారిని అంతం చేయ‌డం కోసం ఎక్క‌డి వారు అక్క‌డే ఉండాల‌ని, ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని పిల‌పునిచ్చారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అయితే ఈ నిర్ణ‌యంతో వ‌ల‌స జీవుల ప‌రిస్థితి అయోమ‌యంలో ప‌డిపోయింది. ఉన్న‌చోట అలానే ఉండాలంటే స‌రైన తిండి, ఇత‌ర స‌దుపాయాలు దొర‌క‌డం లేద‌ని వ‌లస కూలీలుగా ఇత‌ర రాష్ట్రాలు, ప‌క్క జిల్లాలు వెళ్లిన వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మ సొంత ఊరికి తిరిగి వెళ్లిపోదామంటే ఎటువంటి ప్ర‌జా ర‌వాణా కూడా అందుబాటులో లేదు. కొంత మంది సొంత బైక్ లు లాంటివి ఉన్న వాళ్లు ఏదోలా వెళ్లిపోతున్నారు. అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణ‌యాన్ని ఇలాంటి ప్ర‌యాణాలు నీరుగార్చేస్తున్నాయ‌ని, ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండాలని తిండికి స‌మ‌స్య‌లు లేకుండా చేస్తామ‌ని ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో ఏ ర‌వాణా స‌దుపాయం లేకున్నా కాలి న‌డ‌క‌నైనా స‌రే సొంత ఊర్ల‌కు వెళ్లేందుకే వ‌ల‌స కూలీలు ఇష్ట‌ప‌డుతున్నారు. వంద‌ల కిలోమీట‌ర్ల కొద్దీ హైవేల ప‌క్క‌న న‌డిచి వెళ్తున్నారు.

భార్య పిల్ల‌ల‌తో 220 కిలోమీట‌ర్ల న‌డ‌క‌

‘నా సొంతూరు యూపీలోని కాన్పూర్ జిల్లా ఘ‌టంపూర్. నేను రోజు వారీ కూలీగా ఫిరోజాబాద్ లో ప‌ని చేస్తున్నాను. లాక్ డౌన్ తో ఏ వాహ‌నాలు లేక‌పోవ‌డం వ‌ల్ల కాలి న‌క‌డ‌నే సొంతూరికి వెళ్తున్నాం. దాదాపు 220 కిలో మీట‌ర్ల దూరం తిండీ తిప్ప‌లు లేకుండా న‌డిచి వెళ్తున్నాం’ అని అవ‌దేశ్ అనే వ్య‌క్తి చెబుతున్నాడు. త‌న భార్యా పిల్ల‌ల్ని వెంట‌బెట్టుకుని సామాన్ల‌తో ఆగ్రా – కాన్పూర్ హైవే వెంట న‌డిచి వెళ్తున్నాడిత‌డు.

రెండ్రోజులు ప‌ట్టినా సొంతూరు చేరితే చాలు

ప‌లువురు మ‌హిళ‌లు కూడా ఒంట‌రిగా కాలి న‌డ‌క‌న సొంత ఊర్ల‌కు వెళ్తున్నారు. రెండ్రోజులు ప‌ట్టినా స‌రే సొంత గూటికి చేరితే చాల‌ని అంటున్నారు. తాను ఫిరోజాబాద్ నుంచి క‌న్పూర్ దెహాత్ లోని అబ‌కార్పూర్ వెళ్లాల‌ని, నిన్న‌టి నుంచి న‌డస్తూనే ఉన్నాన‌ని చెప్పింది నూర్ జ‌హాన్ అనే మ‌హిళ‌. ఇంటికి చేరుకోవ‌డానికి ఒక‌టి రెండ్రోజులు ప‌ట్టొచ్చ‌ని, తిన‌డానికి ఏమీ లేక‌ ఆక‌లిగా ఉన్నా స‌రే న‌డిచి ఊరికి వెళ్తామ‌ని చెబుతోంది.