వాటర్‌ట్యాంక్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషంట్

వాటర్‌ట్యాంక్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషంట్
  • కరోనా తగ్గదేమోనని భయంతో సూసైడ్ చేసుకున్న యువకుడు

కృష్టా జిల్లాలో దారుణం జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ విషాద ఘటన ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే 30 ఏళ్ల యువకుడు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్టులో లక్ష్మణ్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో లక్ష్మణ్ మూడు రోజులుగా ఇంట్లోనే హోంఐసోలేషన్‌లో ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి లక్ష్మణ్ ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బందిపడ్డాడు. దాంతో  తనకు వచ్చిన కరోనా తగ్గదని మనస్థాపానికి గురయ్యాడు. తీవ్ర భయాందోళనకు గురైన లక్ష్మణ్.. తన ఇంటి ముందున్న వాటర్ సంప్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయాన్నే గమనించిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లక్ష్మణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

కరోనా భయంతో అటు లక్ష్మణ్ కుటుంబసభ్యులు గానీ, ఇంటిపక్కన వాళ్లు గానీ మృతదేహాన్ని సంప్ నుంచి బయటకు తీయడానికి ధైర్యం చేయలేకపోయారు. దాంతో గ్రామస్థులు ఆత్కూరు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్సై, కానిస్టేబుళ్లు పీపీఈ కిట్లు ధరించి లక్ష్మణ్ మృతదేహాన్ని సంప్‌లోనుంచి బయటకు తీసి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.