పది రోజుల్లోనే డబుల్‌‌ అయిన కరోనా పేషంట్లు

పది రోజుల్లోనే డబుల్‌‌ అయిన కరోనా పేషంట్లు
  • 1,435 నుంచి 2,768కి చేరిన ఇన్​ పేషెంట్లు
  • కరోనా వార్డులు పెంచుతున్న కార్పొరేట్‌‌ హాస్పిటళ్లు
  • సర్కారు దవాఖాన్లను నమ్మని జనం.. ప్రైవేటు వైపే చూపు
  • 40–45 ఏండ్ల వాళ్లు ఎక్కువగా చేరుతున్నారంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: దవాఖాన్లలో కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. పది రోజుల్లోనే ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య రెండింతలైంది. పది రోజుల క్రితం ప్రైవేట్‌‌, ప్రభుత్వ హాస్పిటళ్లలో కలిపి 1,435 మంది పేషెంట్లు ఉంటే, ఇప్పుడీ సంఖ్య 2,768కి పెరిగింది. వీరిలో 1,322 మంది ఆక్సిజన్‌‌ సపోర్టుతో ఉండగా, 767 మంది వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. మరోవైపు కార్పొరేట్‌‌ హాస్పిటల్స్‌‌లో బెడ్లు ఫుల్‌‌ అయ్యాయి. 

ప్రైవేటు హాస్పిటళ్లకు క్యూ
గతంలో అన్ని వార్డులనూ కరోనా పేషెంట్ల కోసమే కేటాయించిన కార్పొరేట్ హాస్పిటళ్లు.. నాలుగైదు నెలలుగా కేసులు లేకపోవడంతో వాటన్నింటినీ నాన్ కరోనా వార్డులుగా మార్చేశాయి. మళ్లీ పేషెంట్లు పెరుగుతుండటంతో కరోనా వార్డులను పెంచుతున్నాయి. హైదరాబాద్‌‌లోని గ్లోబల్ హాస్పిటల్‌‌, హైదర్‌‌‌‌గూడ అపోలో హాస్పిటల్‌‌, మాదాపూర్‌‌‌‌లోని మెడికవర్‌‌‌‌ హాస్పిటల్‌‌లో కరోనా పేషెంట్ల కోసం కేటాయించిన బెడ్లు అన్నీ ఫుల్ అయినట్టు సోమవారం నాటి బులెటిన్‌‌లో హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. మరికొన్ని దవాఖాన్లలో సుమారు 90 శాతం బెడ్లు ఫుల్ అయినట్టు పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ దవాఖాన్లలో కరోనా కోసం కేటాయించిన వార్డుల్లో చాలా వరకు ఖాళీగానే ఉన్నట్టు తెలిపింది. ప్రభుత్వ దవాఖాన్లలో అన్ని వసతులు, మందులు, డాక్టర్లను అందుబాటులో ఉంచామని హెల్త్ డైరెక్టర్‌‌, డీఎంఈ చెప్పినా.. జనాలు ప్రైవేట్‌లోనే అడ్మిట్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఇన్‌పేషెంట్లుగా ఉన్న 2,768 మందిలో, 1,948 మంది ప్రైవేట్‌, కార్పొరేట్‌ హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్ పొందుతున్నారు.

కొత్తగా 403 కేసులు
రాష్ర్టంలో మరో 403 మందికి కరోనా సోకింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి 8 గంటల దాకా 33,930 మందికి టెస్ట్ చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌లో 146 మందికి, జిల్లాల్లో 257 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ర్టంలో మొత్తం కేసుల సంఖ్య 3,06,742కు పెరిగిందని, ఇందులో 3,00,469 మంది కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది. మరో ఇద్దరు చనిపోవడంతో, మృతుల సంఖ్య 1,690కి పెరిగినట్టు తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,583 ఉందని, ఇందులో 1,815 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. రాష్ర్టంలో సోమవారం 12,356 మందికి వ్యాక్సిన్ వేశారు. వీరితో కలిపి వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 9,60,342కు చేరింది. 

పేషెంట్లు పెరుగుతున్నరు
కరోనా ఐపీ ఇంక్రీజ్‌ అయింది. నాలుగైదు రోజుల నుంచి పేషెంట్లు వస్తూనే ఉన్నారు. ఇదివరకు 60 ఏళ్లు నిండిన వాళ్లు ఎక్కువ మంది వచ్చేవారు.. ఇప్పుడు 40, 45 ఏండ్ల వాళ్లు కూడా వస్తున్నారు. ఇంతకముందు కంటే వేగంగా సీరియస్‌ కండిషన్‌లోకి వెళ్తున్నారు. మరణాలు మాత్రం పెద్దగా లేవు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. జనాలు జాగ్రత్తగా ఉండాలి. 
- డాక్టర్‌ రమణ ప్రసాద్‌, పల్మనాలజిస్ట్‌, కిమ్స్‌ హాస్పిటల్స్‌