కరోనా వైరస్ దెబ్బకు అమెరికా వణికిపోయింది. అంచనాలకు మించి అమెరికన్లు కరోనా బారిన పడ్డారు. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఈ క్రమంలో ఇటీవలే అమెరికా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 21 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
కాలిఫోర్నియాకు చెందిన మాథ్యూ అనే నర్స్ కూడా ఇటీవల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమెకు తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం వచ్చాయి. దీంతో టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఘటనపై స్పందించిన ఫైజర్… వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని తెలిపింది. పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది.
మన దేశంలో కూడా జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ, మార్గదర్శకాలను రూపొందించింది.
