భజనలో పాల్గొన్న 21 మందికి కరోనా

భజనలో పాల్గొన్న 21 మందికి కరోనా

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా జిల్లాలోని తొండంగిలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. అనంతరం గ్రామంలోని మరో నాలుగు కుటుంబాలతో కలిసి తమ ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించారు. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. భజనలో పాల్గొన్న వారిలో 21 మందికి కరోనా సోకినట్లు ఆ పరీక్షలో తేలింది. సమాచారం తెలిసి అప్రమత్తమైన అధికారులు.. పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన వారందరికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. అదే గ్రామం మొత్తం శానిటైజేషన్ చేపట్టారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్యతోపాటు పాజిటివ్‌ రేటు క్రమంగా పెరుగుతోంది. నాలుగు నెలల తర్వాత గరిష్ఠంగా 758 కేసులు నమోదయ్యాయి. గతేడాది నవంబరు 25న 831మందికి పాజిటివ్‌ రాగా.. ఆ తర్వాత గత 24గంటల్లో నమోదైన కేసులే అత్యధికం. బుధవారం నాటి సంఖ్యతో పోల్చితే ఒక్కసారిగా 173 కేసులు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల వరకు 35,196 నమూనాలను పరీక్షించగా.. 2.15 శాతం మంది వైరస్‌ బారిన పడినట్లు తేలింది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. చిత్తూరులో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. అత్యధికంగా ఈ జిల్లాలో 175 కేసులు నమోదవగా.. గుంటూరులో 127మందికి పాజిటివ్‌గా తేలింది. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 13 కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండంకెలకు చేరింది. దాంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.