
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు :కరోనా కేసుల ప్రకటన, ట్రీట్ మెంట్ విషయంలో సూర్యాపేట జిల్లా ఆఫీసర్ల తీరు మారడం లేదు. పాజిటివ్ కేసులను ప్రకటించకుండానే దాచి పెడుతున్నారు. పేషెంట్లకు రెండు రోజులు కూడా ట్రీట్ మెంట్ చేయకుండానే డిశ్చార్జ్ చేస్తున్నారు. సూర్యాపేట, నేరేడుచర్ల, కోదాడకు చెందిన 16 మందికి గత నెల29న టెస్టులు చేస్తే, 30వ తేదీన పాజిటివ్ కన్ఫర్మ్ చేశారు. ఆ విషయం సంబంధిత పేషెంట్లకు చెప్పకుండా.. హెల్త్ బులెటిన్ లో చూపకుండా దాచిపెట్టారు. శుక్రవారం 7, శనివారం మరో 9 మందికి పాజిటివ్ వచ్చిందని జిల్లా బులెటిన్‌లో ప్రకటించారు. అధికారికంగా ప్రకటించాక ఒక్క రోజు కూడా ట్రీట్ మెంట్ చేయకుండా ఆదివారమే అందరిని డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోలేదని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకసారి నెగెటివ్..మరునాడే పాజిటివ్
కోదాడ టౌన్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సింప్టమ్స్ ఉండడంతో సూర్యాపేట జిల్లా హాస్పిటల్ లో గతనెల 29న శాంపిల్ ఇచ్చాడు. అతడికి కరోనా నెగెటివ్ వచ్చిందంటూ మంగళవారం డిశ్చార్జ్ చేశారు. తిరిగి అదే వ్యక్తికి బుధవారం పాజిటివ్ వచ్చిందని, వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలని సమాచారం ఇచ్చారు. దీంతో డాక్టర్ల తీరుపై ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు