దగ్గు, జలుబు ఉన్న స్టూడెంట్స్ కు స్పెషల్‌‌ రూమ్‌‌

దగ్గు, జలుబు ఉన్న స్టూడెంట్స్ కు స్పెషల్‌‌ రూమ్‌‌

19వ తేదీ నుంచి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్​
హాజరుకానున్న 5.34లక్షల మంది స్టూడెంట్స్‌‌
కరోనా నేపథ్యంలో మాస్కులతో వచ్చినా అనుమతి
స్టూడెంట్స్​ పబ్లిక్​ ప్లేస్‌‌లలో ఎక్కువగా తిరగొద్దు
‘వెలుగు’ ఇంటర్వ్యూలో పరీక్షల విభాగం
డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో ఈనెల19వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకూ పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. స్టూడెంట్లు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. స్టూడెంట్లు అరగంట ముందే పరీక్ష హాల్‌‌‌‌కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక సెంటర్లపై స్పెషల్​ఫోకస్ పెట్టినమనీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం స్కూళ్లకు మాత్రమే ప్రభుత్వం సెలవులు ఇచ్చిందనీ, పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. వాయిదా పడ్తాయనే పుకార్లను నమ్మొద్దని స్పష్టం చేశారు. టెన్త్ ఎగ్జామ్స్​ఏర్పాట్లు, ఇతర వివరాలపై ఆయన ‘వెలుగు’కు స్పెషల్​ఇంటర్వ్యూ ఇచ్చారు.

వెలుగు: ఎంతమంది పరీక్ష రాస్తున్నారు..? 

డైరెక్టర్: రాష్ట్ర వ్యాప్తంగా 5.34లక్షల మంది స్టూడెంట్లు పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం 2,530 సెంటర్లు ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌‌లో ఎక్కువ మంది స్టూడెంట్లు ఉన్నారు. 2,530 మంది చీఫ్​ సూపరింటెండెంట్లను, అంతే సంఖ్యలో డిపార్ట్​మెంటల్​ఆఫీసర్లను నియమించినం. ప్రతి 20మందిరి ఒక ఇన్విజిలేటర్‌‌ను ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా 30,500 మంది ఇన్విజిలేటర్లనూ నియమించినం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12.15 గంటల వరకూ పరీక్ష కొనసాగుతుంది.

వెలుగు: మాస్​ కాపీయింగ్ కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు..?

డైరెక్టర్: మాస్ కాపీయింగ్ కట్టడికి స్టేట్​వైడ్‌‌గా 145 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్‌‌లతో పాటు 400 సిట్టింగ్​స్క్వాడ్లను నియమించాం. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలోనూ స్పెషల్​టీమ్స్ ఉంటాయి. ఇప్పటికే చాలా స్కూళ్లలో సీసీ కెమెరాలున్నాయి. వాటిని వినియోగిస్తున్నం. పరీక్షా కేంద్రంలోకి సెల్​ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదు.

వెలుగు: హాల్​టికెట్ల పంపిణీ పూర్తయిందా?

డైరెక్టర్: ఇప్పటికే అన్ని స్కూళ్లకు హాల్​టికెట్లను పంపించినం. ఈసారి పదిరోజుల ముందే హాల్​టికెట్లను bse.telangana.gov.in వెబ్​సైట్‌‌లో పెట్టినం. ఇప్పటికే 3.50లక్షల మంది డౌన్‌‌లోడ్ చేసుకున్నారు. డౌన్​లోడ్ చేసుకున్న వాటిపై ఎవ్వరి సంతకం లేకున్నా, వారిని ఎగ్జామ్‌‌ హాల్‌‌లోకి అనుమతిస్తం.

వెలుగు:కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

డైరెక్టర్: ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నం. దగ్గు, జలుబుతో బాధపడే స్టూడెంట్లకు ప్రత్యేక రూమ్‌‌లు ఏర్పాటు చేస్తం. మాస్క్‌‌లతో వచ్చినవారిని లోపలికి అనుమతిస్తం. పరీక్షా కేంద్రాలన్నీ నీట్‌‌గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నం.

వెలుగు: వీణా వాణీలకు స్పెషల్ ఏర్పాట్లు చేశారా?

డైరెక్టర్: వీణా–వాణీలకు వేర్వురుగానే హాల్​టికెట్లు జారీచేశాం. వీరు స్పెషల్ కేసు కింద పరిగణించి, జంబ్లింగ్​చేయలేదు. ఎగ్జామ్స్​వాళ్లే స్వయంగా రాస్తామని చెప్పారు. అవసరమైతే సహాయకులను కేటాయిస్తాం. వారు ఉంటున్న స్టేట్ హోమ్‌‌కు దగ్గరలోనే, వారికి సెంటర్​అలాట్ చేసినం.

వెలుగు: స్టూడెంట్లకు మీరిచ్చే సూచనలు.?

డైరెక్టర్: స్టూడెంట్లు వ్యక్తిగత శుభ్రత పాటించాలె. పరీక్షా కేంద్రానికి వచ్చి, నేరుగా ఇండ్లకు మాత్రమే వెళ్లాలె. పబ్లిక్​ప్లేస్‌‌లలో తిరగొద్దు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారికి దూరంగా ఉండండి. 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం కాబట్టి ఇంట్లోంచి ముందే రావాలి. ఆల్​ది బెస్ట్.