ఆ నలుగురిలో ఎవరైతే బెస్ట్!!.. జూబ్లీహిల్స్ లో గులాబీ సీక్రెట్ సర్వే?

ఆ నలుగురిలో ఎవరైతే బెస్ట్!!.. జూబ్లీహిల్స్ లో గులాబీ సీక్రెట్ సర్వే?
  • గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగానే టికెట్!
  • పరిశీలనలో సునీత, పువ్వాడ, విష్ణు, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు 
  • ఓ ఎమ్మెల్సీ నేతృత్వంలో పనిచేస్తున్న సర్వే టీమ్స్
  • సీటు కోల్పోకుండా జాగ్రత్త పడుతున్న కేసీఆర్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇందుకోసం అన్ని పార్టీలూ రెడీ అవుతున్నాయి. ఇది బీఆర్ఎస్  కు సిట్టింగ్  స్థానం. దానిని ఎలాగైనా తిరిగి చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడి నుంచి నలుగురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దివంగత మంత్రి పీజేఆర్  కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 

వీరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తే బాగుంటుందనే అంశంపై కారు పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో సెగ్మెంట్ లో సర్వే చేయించే బాధ్యతలను ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో సర్వే టీములు రంగంలోకి దిగి డోర్ టు  డోర్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. సానుభూతి వర్కవుట్ అవుతుందా..? లేదా..? అన్న సందేహాలు గులాబీ పార్టీని వెంటాడుతున్నాయి. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. తదనంతరం ఉప ఎన్నిక రాగా ఆమె సోదరి నివేదిక బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అయితే  అక్కడ ఆమె ఓటమిని చవి చూసింది. 

దాంతో బీఆర్ఎస్ ఒక సీటను కోల్పోవల్సి వచ్చింది. దీంతో టికెట్ కేటాయింపును జాగ్రత్తగా చేయాలని భావిస్తోంది. పరిశీలనలో ఉన్న మరో పేరు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు సెగ్మెంట్ లో ఎక్కువగా ఉండటం, పువ్వాడకు పరిచయస్తులు ఎక్కువగా ఉండటంతో ఆయన పేరు తెరమీదకు వచ్చింది. మరొకరు మాజీ మంత్రి దివంగత నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. 2009లో ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డికి ఇక్కడ పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. 

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ ఆశించారు. రాకపోవడంతో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా బీఆర్ఎస్ లో ఉంది. మరో నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి.. ఈయన తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. ఆయన కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నలుగురిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గ్రౌండ్ రిపోర్టులో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారు.? ఎవరికి బీఫాం వస్తుందనే చర్చ బీఆర్ఎస్ లో కొనసాగుతోంది.