టాయిలెట్ల ద్వారా కరోనా వ్యాప్తి

టాయిలెట్ల ద్వారా కరోనా వ్యాప్తి
  • చైనాలో ఎవరూ లేని ఓ అపార్ట్ మెంట్ బాత్రూంకూ పాకిన వైరస్
  • కరోనా పేషెంట్ల మలం నుంచి పైపుల ద్వారాపైకి వెళ్తున్న వైరస్
  • చైనా సీడీసీ రీసెర్చ్ లో వెల్లడి

బీజింగ్, న్యూఢిల్లీ: కరోనా వైరస్ టాయిలెట్ల ద్వారా కూడా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి, ముఖ్యంగా అపార్ట్ మెంట్లలో ఒక ఫ్లాట్ నుంచి మరో ఫ్లాట్ కి వ్యాపిస్తోందని చైనీస్ సైంటిస్టులు గుర్తించారు. చైనాలోని గాంగ్జౌ లో చాలాకాలంగా ఎవరూ లేని ఓ అపార్ట్ మెంట్ బాత్రూంలో కరోనా వైరస్ ఆనవాళ్లను కనుగొన్నట్లు వారు ప్రకటించారు. అపార్ట్ మెంట్ కింద ఇంట్లో ఉంటున్న ఐదుగురికి వారం రోజుల క్రిందట కరోనా పాజిటివ్ వచ్చింది. వారు ఉపయోగించిన టాయిలెట్ నుంచే వైరస్ పై అపార్ట్ మెంట్ లోని బాత్రూంలోకి చేరి ఉంటుందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (చైనా సీడీసీ) వెల్లడించింది.

టాయిలెట్ పైపుల ద్వారా పైకి..

కరోనా సోకిన పేషెంట్ల మలంలో వైరస్ కణాలు ఉంటున్నట్లు సైంటిస్టులు ఇదివరకే గుర్తించారు. దీంతో వారు టాయిలెట్లు యూజ్ చేశాక, నీటిని ఫ్లష్ చేసినప్పుడు టాయిలెట్ పైపుల్లో గ్యాస్, ఏరోసాల్స్ ఏర్పడి, వాటితో వైరస్ కలిసిపోయి పైపుల ద్వారా పైకి వస్తోందని చైనా సీడీసీ తెలిపింది. ఆన్ సైట్ ట్రేసర్ సిమ్యు లేషన్ ఎక్స్ పెరిమెంట్ ద్వారా ఆ అపార్ట్ మెంట్ బాత్రూంను పరిశీలించగా, అక్కడి సింక్, నల్లా, షవర్ హ్యాండిల్ పై కూడా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు అంచనాకు వచ్చినట్లు పేర్కొంది. కరోనా పేషెంట్లు ఉంటున్న అపార్ట్ మెంట్లకు పైన 10, 12వ అంతస్తుల్లోని బాత్రూంల వరకూ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది. ఇటీవల విమానంలోని టాయిలెట్ ద్వారా కూడా ఓ మహిళకు కరోనా సోకినట్లు సైంటిస్టులు గుర్తించారు. ఎలాంటి సింప్టమ్స్ లేని కరోనా పేషెంట్ వాడిన తర్వాత ఆమె టాయిలెట్ కు వెళ్లడంతో వైరస్ సోకినట్లు తేలింది. కాగా, పదిహేడేళ్ల క్రిందట హాంకాంగ్ లో సార్స్ వైరస్ తీవ్రంగా వ్యాపించింది. ఆ సమయంలోనూ హాంకాంగ్ లోని అమోయ్ గార్డెన్స్ అపార్ట్ మెంట్లలో వైరస్ టాయిలెట్ల ద్వారా వ్యాపించినట్లు పలు రీసెర్చ్ లలో తేలింది.

60 మందే మిగిలారు..

గ్రేట్ అండమానీస్ ట్రైబ్ ఆదివాసీల జాతి అంతరించిపోయే దశలో ఉంది. ప్రస్తుతం ఈ తెగకు చెందినవాళ్లు స్ట్రెయిట్ ఐల్యాండ్ అనే చిన్న దీవిలో 60 మంది మాత్రమే ఉన్నారు. 1971లో వీరు 24 మంది మాత్రమే ఉండగా, 2001 నాటికి వీరి సంఖ్య 43కు, ప్రస్తుతం 60కి పెరిగింది. జనాభా పదుల్లోనే ఉన్నందున ఈ తెగను కేంద్ర ప్రభుత్వం పర్టిక్యులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్ (పీవీటీజీ) కేటగిరీలో చేర్చింది. ఒకప్పుడు వేటాడుతూ జీవించే ఈ తెగ ప్రజలు ఇప్పుడు తమ లైఫ్ స్టైల్ ను మార్చుకుంటున్నారు. కొందరు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.

అండమాన్ ఆదివాసీలకూ కరోనా..

కరోనా మహమ్మారి అండమాన్ నికోబార్ దీవుల్లో మారుమూల దీవిలో నివసించే ఆదివాసీలకూ అంటుకుంది. గ్రేట్ అండమానీస్ ట్రైబ్ కు చెందిన ఐదుగురికి వైరస్ సోకినట్లు అండమాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అవిజిత్ రాయ్ వెల్లడించారు. వీరికి ఎలాంటి సింప్టమ్స్ లేవని, అందరినీ పోర్ట్ బ్లెయిర్ లోని హాస్పిటల్ కు తరలించి ఐసోలేషన్ లో ఉంచామని ఆయన తెలిపారు. అంతరించే దశలో ఉన్నందున ఈ తెగలోని అందరికీ స్పెషల్ టీం వెళ్లి ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేసింది. పది రోజుల పాటు వీరిని అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత.. ఎలాంటి సింప్టమ్స్ లేకపోతే తిరిగి వాళ్ల దీవికి పంపిస్తామని అవిజిత్ రాయ్ చెప్పారు. ప్రస్తుతం ఈ దీవిలోకి అధికారులు తప్ప బయటివారెవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.