ఊరికి పోయినోళ్లు.. వచ్చినోళ్లలో కరోనా టెన్షన్

ఊరికి పోయినోళ్లు.. వచ్చినోళ్లలో కరోనా టెన్షన్
  • సిటీ నుంచి వెళ్లాకే బయటపడుతోన్న లక్షణాలు
  • వెదర్​లో మార్పులు, వైరస్ స్ప్రెడ్ ​తో పెరుగుతోన్న బాధితులు 
  • పాజిటివ్ వస్తే ఇంటి వద్దే కుటుంబమంతా ఐసోలేషన్

సిటీలోని ఫార్మా కంపెనీలో పనిచేసే ఓ యువకుడు సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లాడు.  ఈనెల13న అతనికి ఫీవర్​ ఉండటంతో మెడిసిన్​వేసుకున్నా తగ్గలేదు. అట్లనే ఇంటికి పోయాడు. జ్వరం, తలనొప్పి, దగ్గు తీవ్రత ఎక్కువవడంతో  టెస్టు చేసుకోగా పాజిటివ్​ వచ్చింది. దీంతో అతని ఇంట్లోని నలుగురు ఫ్యామిలీ మెంబర్స్​కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చింది.

‘‘సిటీలో ఉండే ఓ ప్రభుత్వ ఉద్యోగిని పిల్లలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో కరీంనగర్​ వెళ్లారు. ఈనెల 12న ఆమె కూడా పండగకు సొంతూరు వెళ్లింది. ఆ మరుసటి రోజు నుంచే ఆమె తీవ్రమైన దగ్గుతో బాధపడింది. అనుమానంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో తన తల్లిగారింట్లో పిల్లలతో పాటు ఆమె కూడా ఐసోలేషన్​లో ఉంటోంది’’.

హైదరాబాద్, వెలుగు: పండుగకు సిటీ నుంచి సొంతూళ్లకు వెళ్లిన వారిలో చాలామందికి హెల్త్​ ప్రాబ్లమ్స్ ​వస్తున్నాయి. కొందరు అనుమానంతో టెస్ట్​ చేయించుకుంటే కరోనా పాజిటివ్​గా తేలుతోంది.  సిటీకి తిరిగి వచ్చిన వారిలోనూ సింప్టమ్స్​తో బాధపడేవారు ఎక్కువవుతున్నారు. సిటీలో ఉన్నన్ని రోజులు మామూలుగానే ఉన్నవారు కూడా జర్నీలు చేయడం, వెదర్​ మార్పులతో సిక్​ అవుతున్నారు. కొందరికి పాజిటివ్ వస్తుండగా.. మరికొందరు వైరస్​లక్షణాలతో ఇబ్బందులు పడుతూ హోం ఐసోలేషన్​లో ఉంటున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు  సాధారణమో, కరోనా లక్షణాలో తెలియక టెన్షన్ ​పడుతున్నారు. 

సిక్​ అవుతుండగా..

ఇటీవల కాలంలో సిటీలో కరోనా కేసులు ఎక్కువవుతుండగా, వారం రోజుల తేడాలోనే గ్రేటర్ లో వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. జర్నీ కారణంగా త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సొంతూళ్లకు వెళ్లగానే పండుగ సంబురం లేకుండా కరోనా లక్షణాలతో హోం ఐసోలేషన్ అయినవారే ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి సిటీలోని విద్యానగర్​కు చెందిన ఓ యువ జంటకు 3 రోజుల వరకు ఎలాంటి లక్షణాలు లేవు. దీంతో సాధారణంగానే బంధువులతో గడిపారు. భోగి రోజున తీవ్ర జ్వరం, దగ్గు, తలనొప్పితో సిక్ అయ్యారు. కరోనా టెస్టు చేయగా ఒకరికి పాజిటివ్ అని తేలడంతో డాక్టర్ల సూచనతో హోం ఐసోలేషన్ అయ్యారు.  అదే ఇంట్లో మరో 8 మంది ఫీవర్​తో బాధపడుతున్నారు. 

జాగ్రత్తలు తీసుకోకుంటే...

సొంతూళ్లకు ప్రయాణాలే ఇప్పుడు రోగాల బారిన పడేలా చేసింది. గంటల కొద్దీ జర్నీ చేసిన వారిలో  మెజార్టీ జనాలు మైల్డ్ సింప్టమ్స్ తో బాధపడుతున్నారు. వానలు పడడంతో ఒక్కసారిగా మారిన వాతావరణం కూడా ఫ్లూ లక్షణాలతో బాధపడేలా చేస్తోందని డాక్టర్లు పేర్కొంటున్నారు.  ఆందోళన చెందకుండా లక్షణాల తీవ్రతను బట్టి అనుమానం ఉంటే టెస్టులు చేసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్ కావడమే బెటరని సూచిస్తున్నారు. లక్షణాలు ఉన్నా టెస్టులకు దూరంగా ఉండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

ఎక్కువైతోన్న  కేసులు

సొంతూళ్ల నుంచి సిటీకి తిరిగొచ్చిన వారిలో వైరస్​ లక్షణాలు బయట పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది సాధారణ జ్వర పీడితులే అయినా, పాజిటివ్ ​కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు సిటీలో వందల్లో  కేసులు వస్తుండగా, ఈ వారంలో ఈ సంఖ్య  పెరిగే ప్రమాదం ఉంది. సాధారణ ఫ్లూ లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన కొంత వరకు ప్రయోజనం ఉంటుందని రంగారెడ్డి డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి సూచిస్తున్నారు. ఈనెల16న రంగారెడ్డి, మేడ్చల్, జీహెచ్ఎంసీ పరిధిలో 1,492 కేసులు నమోదు కాగా, 17న 1,530 వచ్చాయి. గత వారం రోజుల కిందట మూడు జిల్లాల పరిధిలో 800 లోపే కేసులు వచ్చాయి. 

ఐసోలేషన్ కష్టాలు 

ఇప్పటికే సొంతూళ్లలో ఐసోలేషన్ అయిన వారికి ఇబ్బందులు తప్పట్లేదు. గ్రామాల్లో వైద్య సేవలపై ఆందోళన చెందుతున్నవారు కొందరైతే, కరోనాతో భయపడుతున్న వారు మరికొందరు. ఆఫీసులకు సెలవులు, జాబ్​ల విషయంలోనూ టెన్షన్ ​పడుతున్నారు.  ఇప్పటికే కొన్ని ప్రైవేటు కంపెనీలు పెరుగుతున్న కేసుల దృష్ట్యా వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ కల్పించడంతో కొందరు ఊరట చెందుతుండగా, ఎలాంటి భరోసా లేని వారు సిటీకి రాలేక, ఇంట్లో ఐసోలేషన్ కాలేక ఒత్తిడికి లోనవుతున్నారు.