గల్ఫ్​ కుటుంబాల్లో ‘కరోనా’ బెంగ

గల్ఫ్​ కుటుంబాల్లో ‘కరోనా’ బెంగ

దుబాయ్​నుంచి వచ్చినవారికి కరోనా లక్షణాలతో  టెన్షన్
ఫోన్ల ద్వారా క్షేమ సమాచారం తెలుసుకుంటున్న స్థానికులు

కరీంనగర్, వెలుగు: ఉద్యోగ, ఉపాధి రీత్యా విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్​ దేశాల్లో ఉంటున్న వలస జీవుల ఆరోగ్యంపై స్థానికంగా వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల దుబాయి నుంచి వచ్చిన హైదరాబాదీకి కరోనా పాజిటివ్​ఉన్నట్లు తేలడం, గల్ఫ్​ నుంచే వచ్చిన ఒకరిద్దరు అలాంటి లక్షణాలతో హాస్పిటల్​లో  చేరడంతో టెన్షన్​ మొదలైంది.  దీంతో విదేశాల్లో ఉంటున్నవారి క్షేమసమాచారాన్ని కుటుంబసభ్యులు ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

మూడు జిల్లాల నుంచే అధికం

మన రాష్ట్రం నుంచి చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత కరీంనగర్​, ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాల నుంచి 2 లక్షలకు పైగా వలసజీవులు దుబాయ్, ఖతార్, కువైట్, సౌదీ, బహ్రయిన్ లాంటి దేశాల్లో కూలినాలి, ఇతరత్రా ఉపాధి పొందుతున్నారు. సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ మనవాళ్లు వేలాదిగా ఉన్నారు. పాత ఆదిలాబాద్  నుంచి సుమారు 25 వేల మంది(ఇందులో 80 శాతం నిర్మల్  జిల్లా నుంచే), పాత నిజామాబాద్  జిల్లా నుంచి సుమారు 40 వేల మంది, పాత కరీంనగర్ జిల్లా (ప్రధానంగా జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల) నుంచి సుమారు లక్షన్నర మంది విదేశాల్లో నివసిస్తున్నారు. కరోనాకు పుట్టినిల్లయిన చైనా తర్వాత ఆ వైరస్​ ఎఫెక్ట్​ దక్షిణ కొరియా, సింగపూర్​పై ఉంది.  కువైట్, మలేషియా, బహ్రెయిన్, ఆస్ట్రేలియా, ఇరాక్, ఓమన్, ఖతార్, ఇజ్రాయిల్  దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.  సింగపూర్ దేశంలో ఇప్పటికే 110 మంది అనుమానితులను గుర్తించి, ఐసోలేటేడ్ వార్డుల్లో పరిశీలనలో ఉంచారు. వివిధ దేశాలకు కనెక్టివిటీగా ఉన్న దుబాయ్​ నుంచి వస్తున్న వారిలో కరోనా లక్షణాలు బయటపడుతుండడంతో ఆయా దేశాల్లో తమవారి ఆరోగ్యం గురించి స్థానికంగా ఉన్న వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ప్రయాణాలు వాయిదా

ఇక్కడికి రావాలనుకునేవారు కరోనా భయంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఎలాగోలా వచ్చినా దేశంలో అడుగుపెట్టనిస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. కొత్తగా గల్ఫ్, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్లాలనుకునేవారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. హెల్త్​ టెస్ట్​ సర్టిఫికెట్ ఇచ్చే దగ్గర డిక్లరేషన్ ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది ఆయా దేశాలకు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు ఒక స్థాయి ఉద్యోగులను పక్కనపెడితే కార్మికుల ఆరోగ్యంపట్ల కంపెనీలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.

భయంగా ఉంది జాగ్రత్తలు చెబుతున్నరు

నేను ఫైనాన్సియల్ మేనేజర్ గా ఖతార్ లో పనిచేస్తున్న. ఇక్కడ ఇరాన్ నుంచి వచ్చిన  ముగ్గురికి వైరస్ ఉందంటే హాస్పిటల్ లో చెక్ చేస్తున్నరు. ఇంకా ఇండియా నుంచి వచ్చే ఫ్లైట్లు ఆగిపోలే. కానీ ఆపేస్తరని పుకార్లు వస్తున్నయి. ముఖ్యంగా బయటకు వెళ్లేటపుడు మాస్కులు, చేతులకు గ్లవ్స్ వేసుకోవాలని ఆర్డర్స్ ఇస్తున్నరు. టాక్సీలు నడిపే డ్రైవర్లు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నరు. లోకల్ రేడియోల్లో ప్రచారాలు చేస్తున్నరు. జాగ్రత్తలు పాటించని వారికి పెనాల్టీలు వేస్తమని చెబుతున్నరు. రోజురోజుకి సీరియస్ నెస్ పెరుగుతున్నది.

 – ఖాజా నిజాముద్దీన్, ఖతార్(మెట్ పల్లి వాసి)

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు