ఆటలు,మ్యూజిక్ తో కరోనా థెరపీ..ఏపీ క్వారంటైన్ సెంటర్లలో సందడి

ఆటలు,మ్యూజిక్ తో కరోనా థెరపీ..ఏపీ క్వారంటైన్ సెంటర్లలో సందడి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుగా భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ క్రమంలో అధికారులు కరోనా వ్యాధి సోకిన వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు, వారిని ఉల్లాసంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. లక్షణాలు లేనివారే ఎక్కువ సంఖ్యలో ఉంటుండగా, వారిని కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వారికి ఆటలు, మ్యూజిక్ తో కరోనా థెరపీ అందిస్తున్నారు. రోగులు తమకు ఇష్టమైన పాటలు వినే సదుపాయం కల్పించారు. అంతేకాదు, క్వారంటైన్ సెంటర్లలో అన్ని రకాల స్పోర్ట్స్ కిట్లను అందుబాటులో ఉంచారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్ ఇలా అనేక క్రీడలతో అనంతపురం జిల్లా కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలు సందడిగా మారాయి.

అంతేకాదు ఈ సెంటర్లలో  ఆన్ లైన్ సినిమాలు చూసేందుకు వీలుగా ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాప్ టాప్, ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు కరోనా రోగుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసేందుకు కౌన్సెలింగ్ అందించే ఏర్పాట్లు కూడా ఉన్నారు అధికారులు.