అయోధ్యలో మాంసం అమ్మకాలపై నిషేధం ఎత్తివేత

అయోధ్యలో మాంసం అమ్మకాలపై నిషేధం ఎత్తివేత

అయోధ్యలో మాంసం అమ్మకాలపై నిషేధం ఎత్తివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ భయంతో ఈ నెల 14న మాంసం, దాని ఉత్పత్తులపై బ్యాన్ పెట్టారు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఏకే సింగ్.  మాంసం తింటే వైరస్ బారిన పడే అవకాశం ఉందన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజల్లో లేని భయాలను పెంచుతున్నారంటూ దీనిపై స్థానిక మీడియాలో వార్తలు రావడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మాంసం తినడం వల్ల కరోనా వచ్చే ప్రమాదం ఏమీ లేదని, వెంటనే బ్యాన్ ఎత్తేయాలని ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.

చైనాలో పుట్టిన ప్రాణాంతక వైరస్ కరోనాపై ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో 74 వేల మంది ఈ వైరస్ బారినపడగా.. 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కొద్ది రోజుల క్రితం చైనా నుంచి అయోధ్య తిరిగి వచ్చిన ఏడుగురిని తమ ఇళ్లలోనే ప్రత్యేకంగా అబ్జర్వేషన్‌లో ఉంచారు వైద్యులు. దీంతో ప్రజల్లో కరోనా భయం పెరగడంతో అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని రకాల మాంసం, దాని ఉత్పత్తులపై నిషేధం విధించారు. అయితే చైనా నుంచి వచ్చిన ఆ ఏడుగురు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తేల్చారని చెప్పారు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ ఏకే సింగ్. వారికి అన్ని టెస్టులూ నార్మల్‌గా ఉన్నాయని, కరోనా లేదని తేలడంతో మాంసం అమ్మకాలపై నిషేధం ఎత్తేశామని తెలిపారు.