హెల్త్ కు కార్పొరేట్ బూస్ట్..వైద్య రంగానికి సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ నిధుల వెల్లువ

హెల్త్ కు కార్పొరేట్ బూస్ట్..వైద్య రంగానికి సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ నిధుల వెల్లువ
  • మూడేండ్లలో రూ.614 కోట్లు ఖర్చుపెట్టిన కంపెనీలు
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్​సభలో కేంద్రం సమాధానం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్  సోషల్  రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) కింద చదువుకు ఎంత విలువిస్తున్నాయో.. హెల్త్ కూ అంతే ప్రయారిటీ ఇస్తున్నాయి. రాష్ట్రంలో విద్య తర్వాత అత్యధికంగా వైద్య రంగానికే కంపెనీలు నిధులను వెచ్చిస్తున్నాయి. 

కరోనా కష్టకాలం పోయినా.. మన రాష్ట్రంలో మాత్రం హెల్త్  సెక్టార్‌‌‌‌‌‌‌‌ కు కంపెనీల ఫండింగ్  ఏమాత్రం తగ్గలేదు. గడిచిన మూడేండ్లలోనే ఏకంగా రూ.614 కోట్లను కార్పొరేట్  సంస్థలు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేశాయి. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌‌‌‌‌‌‌‌ సభలో కేంద్ర కార్పొరేట్  వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్  మల్హోత్రా ఈ వివరాలను వెల్లడించారు. 

దేశవ్యాప్తంగా ట్రెండ్  చూస్తే వైద్యానికి నిధులు తగ్గుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం ఆ గ్రాఫ్  పడిపోకుండా నిలకడగా ఉండటం విశేషం. కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం.. హెల్త్  సెక్టార్ కు సీఎస్ఆర్  ద్వారా 2021–-22లో రూ.196.80 కోట్లు, 2022–-23 లో రూ.210.43 కోట్లు ఖర్చు చేయగా.. 2023–24 లో రూ. 207.57 కోట్లను వెచ్చించారు.

దేశవ్యాప్తంగా 2021–-22లో రూ.8 వేల కోట్లుగా ఉన్న హెల్త్  ఫండ్స్...  ఇప్పుడు రూ.7,150 కోట్లకు పడిపోయాయి. కొవిడ్  టైంలో ఆక్సిజన్  ప్లాంట్లు, బెడ్ల కోసం ఖర్చుపెట్టిన కంపెనీలు.. ప్రస్తుతం సోషల్  రెస్పాన్సిబిలిటీని తగ్గించినా... మన రాష్ట్రంలో మాత్రం పాత స్పీడునే కంటిన్యూ చేస్తున్నాయి.

రూరల్  జిల్లాలకు మొండిచేయి... 

కంపెనీలు కోట్లు కుమ్మరిస్తున్నామని చెబుతున్నా.. ఈ నిధులన్నీ ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి చుట్టపక్కలా జిల్లాలకే పరిమితం అవుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చూస్తే  అర్థం అవుతుంది. వైద్య రంగానికే కాకుండా అన్ని రంగాలకు సంబంధించి... మూడేండ్ల కాలంలో హైదరాబాద్  జిల్లాకు రూ.1,732.54 కోట్లు ఖర్చు చేయగా, రంగారెడ్డి జిల్లాకు రూ.273.05 కోట్లు, మెదక్  జిల్లాకు రూ.121.08 కోట్లు, నల్గొండ జిల్లాకు రూ.72.64 కోట్లు, మహబూబ్‌‌‌‌‌‌‌‌ నగర్  జిల్లాలకు రూ.70.50 కోట్లను కంపెనీలు ఖర్చుచేశాయి.  

అయితే, ఈ మూడేండ్ల కాలంలో హనుమకొండ, మంచిర్యాల, నారాయణపేట జిల్లాలకు కార్పొరేట్లు పూర్తిగా మొండిచేయి చూపాయి. వికారాబాద్  జిల్లాకు 2022–-23లో ఒకేసారి రూ. 66.94 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ మూడేండ్ల కాలంలో పెద్దపల్లి జిల్లాకు కేవలం మూడు లక్షలు, ములుగు జిల్లాకు రూ.రెండు లక్షలు ఇచ్చారు. కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్  భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలకు కోటి లోపు మాత్రమే ఖర్చుచేశారు.