బల్దియా కౌన్సిల్ బైకాట్ చేసిన..ఆఫీసర్లపై చర్యలు తీసుకోండి

బల్దియా కౌన్సిల్ బైకాట్ చేసిన..ఆఫీసర్లపై చర్యలు తీసుకోండి
  •     మమత, ఈడీ సత్యనారాయణలపై ముఖ్యమంత్రికి కార్పొరేటర్ నర్సింహారెడ్డి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు : వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణతో పాటు మొన్నటివరకు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా పని చేసిన మమతపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి బుధవారం సెక్రటేరియట్ లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. గతేడాది మే 3న  కౌన్సిల్ మీటింగ్ లో అధికారులు మధ్యలోనే బైకాట్ చేసి వెళ్లిపోయారని, అందుకు వీరిద్దరే కారణమని సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో ఆయన పేర్కొన్నారు.

ఆ మీటింగ్ వాయిదా పడటంతో కార్పొరేటర్ల సమయంతో పాటు కౌన్సిల్ సమావేశానికి  తొమ్మిది లక్షల రూపాయల ఖర్చు వృథా అయిందని వివరించారు.  వీరిపై ఇటీవల జరిగిన కౌన్సిల్లోనూ తీర్మానం చేయాలని చెప్పినా మేయర్ పట్టించుకోలేదని, అందుకే  తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.

దీనిపై ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు నర్సింహారెడ్డి తెలిపారు.  వినతిపత్రం అందించేందుకే  సీఎంని కలిశానని,  ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని చెప్పారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తమని,  ఏదైనా ఉంటే ముందుగా ప్రకటిస్తానన్నారు.