తెలంగాణలో అవినీతి భారీగా పెరిగింది: దిగ్విజయ్ సింగ్

తెలంగాణలో అవినీతి భారీగా పెరిగింది: దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని, ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ పాలనతో అందరూ విసిగిపోయారని విమర్శించారు. అన్ని వర్గాలు బాగుండాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ.. ఏ ఒక్కరూ హ్యాపీగా లేరని అన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. రైతులు, నిరుద్యోగులు సహా అందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘‘కౌలు రైతులకు కేసీఆర్ న్యాయం చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారికీ రైతు భరోసా వర్తింపజేస్తాం. పేపర్ లీకులతో నిరుద్యోగులకు అన్యాయం చేశారు. ఎవరికీ జాబ్ లు ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్​తో హైదరాబాద్ డెవలప్ అయింది. ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్ తీసుకురావడంతోనే హైదరాబాద్​కు ఐటీ ఇండస్ట్రీలు క్యూ కడ్తున్నాయి. బెంగళూరుతో పోటీ పడే స్థాయికి హైదరాబాద్ వెళ్లింది”అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఏ ఆకాంక్షల కోసమైతే రాష్ట్రం ఇచ్చామో.. ఇప్పుడు ఆ తెలంగాణను మరో ఎత్తుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. సోనియా అందుకు ఆరు గ్యారంటీలు ప్రకటించారని, వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు.

ప్రజాస్వామ్యం బలహీనపడ్డది

దేశంతో పాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రా జ్యాంగం బలహీనపడ్డాయని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అన్ని వర్గాలకూ న్యాయం చేసేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే.. ప్రధాని, కేసీఆర్ దాన్నిబలహీనపరుస్తున్నారన్నారు. 2008 ముంబై దాడుల్లో (26/11) ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.