వానలతో పత్తి రైతుల పరేషాన్‌

వానలతో పత్తి రైతుల పరేషాన్‌

మక్క పంటకూ పెద్ద దెబ్బే.. 
రోజూ వానలతో పత్తికి తేమ పెరుగుతోంది
తేమ 8% లోపుంటేనే రూ.5550 మద్దతు ధర 
ఆరబెట్టి తేవాలంటున్న మార్కెటింగ్‌శాఖ 
తేమ సాకుతో అడ్డగోలుగా దోచుకుంటున్న వ్యాపారులు

హైదరాబాద్‌, వెలుగు: ఎడతెరిపి లేకుండా రోజూ కురిసి పోతున్న చెరుపుడు వానలు పత్తి, మొక్కజొన్న రైతులను పరేషాన్ చేస్తున్నాయి. పత్తి ఆరడం లేదు. మక్కలు ఎండడం లేదు. మార్కెట్ కు తీసుకపోతే మంచి ధర రాక రైతులు గోస పడుతున్నారు. రాష్ట్రంలో ఈసారి పత్తి పంట సాగు బాగా పెరిగింది. కానీ రోజూ వానలు పడుతూ పంటను నాశనం చేస్తున్నాయి. ఒకవైపు పత్తి కాయలు దెబ్బతింటున్నాయి. మరోవైపు ఇప్పటివరకే ఏరిన పత్తికి తేమ పెరుగుతుండటం కూడా సమస్యగా మారింది. వర్షాలతో పత్తికాయలకు ఫంగస్‌ వస్తోందని, విరబూసిన పత్తి వర్షంలో తడిసి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.200 కూలీ ఇచ్చి పత్తిని ఏరించి ఇంటికి తీసుకొచ్చినా అది మార్కెట్‌కు తీసుకెళ్లే పరిస్థితి ఉండటంలేదు. ఎలాగోలా మార్కెట్ కు తీసుకుపోయినా ధర పలకడం లేదు. దీంతో కొందరు  రైతులు ఇళ్లల్లో ఫ్యాన్లు పెట్టుకుని మరీ పత్తిని ఆరబెడుతున్నారు. పత్తిని ఆరబెట్టే వీలులేక నేరుగా మార్కెట్‌కు తీసుకుపోయిన రైతులను వ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. మొక్కజొన్న పరిస్థితి కూడా అంతే అన్నట్లుగా ఉంది. వానలకు పంట బాగా దెబ్బతింటోంది. చేలలో తెంపిక మక్క కంకులు వానలతో తడిసి ముద్దవుతున్నాయి. దీంతో కంకులు ఎండబెట్టుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

పత్తికి 20% దాటుతున్న తేమ

పత్తికి తేమ 8 శాతం లోపు ఉంటేనే మద్దతు ధర రూ.5550 ఇస్తామని, అందుకే పత్తిని ఆరబెట్టి తేవాలంటూ రైతులకు మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. 12 శాతం తేమ ఉంటే  రూ.5230 మాత్రమే చెల్లిస్తామని అంటున్నారు. కానీ వర్షాలతో వాతావరణం చల్లగా మారడంతో పత్తి ఆరడం లేదు. పత్తిలో తేమ శాతం 20 శాతానికి  మించుతోంది. దీంతో మార్కెట్‌లో తేమ ఎక్కువున్న పత్తిని కొనక పోవడంతో డబ్బులు అత్యవసరమైన రైతులు వచ్చినకాడికి ప్రైవేటు వ్యాపారులకు  అమ్ముకుంటున్నారు. మరికొందరు యాసంగి పెట్టుబడులకు చేతుల డబ్బులు లేక  నాలుగైదు బస్తాల పత్తిని అమ్ముకుంటున్నారు. దీంతో వ్యాపారులు రైతుల నుంచి రూ.3500 నుంచి రూ.4000 లోపు ధరకే కొంటున్నారు. ‘‘తేమ పోవడానికి కూలీలను పెట్టుకొని ఆరబెట్టుకోవాలె. మేం అడిగిన ధరకు ఇస్తే  ఇయ్యి లేకపోతే లేదు” అంటూ వ్యాపారులు రైతులను దబాయిస్తున్నారు. దీంతో చేసేది లేక వాళ్లు అడిగిన ధరకే అమ్ముకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మక్కలకూ మద్దతు ధరొస్తలే..   

మొక్కజొన్న పంటను వానలు బాగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే కొందరికి పంట చేతికొచ్చింది. కొందరు రైతులు ఇంకా కంకులను ఇరవలేదు. కొందరు కంకులు ఇరిసి ఎండబెడుతుండగా రోజూ పడుతున్న వానలతో  మక్కలు తడుస్తున్నాయి. దీంతో కొందరు రైతులు వాన దెబ్బకు కంకులు ఇరవకుండా చేలలోనే వదిలేస్తున్నారు. తెంపిన కంకులు తడవకుండా కాపాడు కోవడానికి రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. కంకులను పంట భూముల్లో ఎండ పోస్తే మరింత దెబ్బతింటున్నాయి. అందుకే అవకాశం ఉన్న రైతులు కంకులను సిమెంట్‌ ప్లాట్‌ఫారమ్‌లు లేక తారు రోడ్ల మీద ఆరబోస్తున్నారు. వర్షాలతో మక్కలు తడువడంతో మార్కెట్‌లో రేట్లు తక్కువ పలుకుతున్నాయి. మార్కెట్‌లో కనీస మద్దతు ధర రూ.1760 ఉంది. కానీ   మక్కలు ఆరకపోవడంతో రూ.1600 కంటే ఎక్కువ ధరకు కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగం ఆగం అయితుండది

కోరె బీరయ్య, ఆలేరు, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లా

పత్తిని ఫ్యాన్‌లతో ఆరబెడుతున్నం

మంగ రామమూర్తి,గూడూరు, మహబూబాబాద్‌ జిల్లా