ప్రాణహిత వరదకు నీటమునిగిన పత్తి: కౌలు రైతు ఆత్మహత్య

ప్రాణహిత వరదకు నీటమునిగిన పత్తి: కౌలు రైతు ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా: పత్తిపంట నష్టపోయిందని కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మంచిర్యాల జిల్లాలో జరిగింది.  కోటపల్లి మండలం, పుల్లగామ గ్రామానికి చెందిన కామ లింగయ్య (60) అనే కౌలు రైతు 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. అయితే ఇటీవల వచ్చిన ప్రాణహిత నది బ్యాక్ వాటర్‌లో పంట పూర్తిగా దెబ్బతినడంతో.. మనస్తాపం చెందిన లింగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీరుమున్నీరుగా విలపించారు కుటుంబ సభ్యులు.

పంట పెట్టుబడి కోసం వడ్డీకి డబ్బులు తెచ్చి సాగు చేశామని .. తీరా పంట చేతికి వచ్చేసరికి ఇలా వరద రూపంతో కొట్టుకుపోవడంతో రైతు గుండె ఆగిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మేడిగడ్డ బ్యారేజీ వల్ల ప్రాణహిత వరద ఎక్కువ కావడంతో చేనుల్లోకి భారీగా వరద రావడంతో వేల ఎకరాల్లో పత్తి పంట నీటమునిగిందని చెబుతున్నారు తీవ్రంగా నష్టపోయిన రైతులు. ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వకుంటే ఆత్మహత్యలే దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు.