మునుగోడులో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం

కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సఖేందర్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డికి కుటుంబం..రాజకీయాల్లో లేదా అని ఆయన ప్రశ్నించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని..రాజకీయంగా విస్తరణ కోసమే బీజేపీ ఆయనతో రాజీనామా చేయించిందని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ల చేతుల్లోకి రాష్ట్రం వెళితే ప్రజలకు తీవ్ర నష్ట వాటిల్లుతుందన్నారు. 

కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందని..మునుగోడులో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని గుత్తా దీమా వ్యక్తం చేశారు. రేవంత్ పై దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయన్నారు. జాతీయ జెండా స్టేటస్లు, డీపీలు పెట్టుకోమని చెప్పే మోడీకి చాలా రాష్ట్రాల్లో ప్రజలకు సరైన తిండి లేదని తెలియదా అని నిలదీశారు. నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని..వాటి నుంచి దృష్టి మళ్లించేందుకే వివిధ రాష్ట్రాలలో రాజకీయ అనైతిక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీపై తనకు ఆసక్తి లేదని..మండలి చైర్మన్ గా సంతృప్తిగానే ఉన్నట్లు గుత్తా తెలిపారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణం ప్రజలకు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదని..తిండి ఎక్కువై రాజీనామా చేశారని మండిపడ్డారు. ఉన్నదాని కంటే ఎక్కువ ఊహించుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మొదటి నుంచి అలవాటని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి పోటీలో ఉన్నప్పుడు సీనియర్లు మద్ధతు ఇవ్వకపోతే..తాను,  జానారెడ్డి అందర్నీ కన్విన్స్ చేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించినట్లు చెప్పారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరని గుత్తా వ్యాఖ్యానించారు.