
- ఆర్ అండ్ బీ అధికారులకు కౌన్సిల్ చైర్మన్ గుత్తా ఆదేశం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బిల్డింగ్ లో కొనసాగుతున్న కౌన్సిల్ బిల్డింగ్ రిపేర్లు వచ్చే నెల 15 కల్లా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఈ రిపేర్ పనులను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సెక్రటరీ నరసింహచార్యులు, చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, ఆగాఖాన్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. ఆగాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీలో కౌన్సిల్ హాల్ ను సొంత నిధులతో రిపేర్లు చేస్తున్నది.
ఈ పనులను ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెలలో అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. రానున్న సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తాజాగా ఇప్పటి వరకు పూర్తి అయిన పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారని చైర్మన్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. వచ్చే నెలలో శాసన మండలి సమావేశాలు పాత భవనంలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారని ఆయన వివరించారు. పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా, పనులు చేపట్టాలని చైర్మన్ ఆదేశించారు.