
హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లకు పరీక్షల భయం, ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సెలర్లను నియమిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంటర్ స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, ఆత్మహత్యలను నివారించేందుకు కాలేజీల్లోనూ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని వనిత మహావిద్యాలయ ఆడిటోరియంలో స్టూడెంట్ల ఆత్మహత్యల నివారణ కోసం నియమించిన కౌన్సెలర్ల ట్రైనింగ్‌ను ఆమె ప్రారంభించారు. పదో తరగతి అయిపోగానే స్టూడెంట్లలో శారీరకంగా, మానసికంగా మార్పు వస్తుందని, ఇలాంటి సమయంలో వారికి సరైన గైడెన్స్ అవసరమని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో 2 వేలకుపైగా కాలేజీలున్నాయని, అందులో ముందు 404 సర్కారు కాలేజీల్లో కౌన్సెలర్లను నియమిస్తున్నామని ఆమె తెలిపారు. వారికి మానసిక, వ్యక్తిత్వ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. త్వరలోనే అన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోనూ కౌన్సెలర్లను నియమించేలా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల కంటే, కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. స్టూడెంట్ల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ చలించిపోయారని, ఆయన సూచన మేరకే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. గతంలో ప్రేమ పేరిట దాడులు జరిగినప్పుడే కౌన్సెలర్లను నియమించాలనుకున్నా కుదరలేదన్నారు. ఇంటర్లో ఫెయిల్ అయిన, సబ్జెక్టుల్లో వెనకబడిన స్టూడెంట్లకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. చదువుల్లో రాణించే వారికీ వివిధ ప్రవేశపరీక్షల కోసం స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు.