కశ్మీర్ పై భారత్ ని సపోర్ట్ చేసే దేశాలపైనా యుద్ధమే: పాక్ మంత్రి

కశ్మీర్ పై భారత్ ని సపోర్ట్ చేసే దేశాలపైనా యుద్ధమే: పాక్ మంత్రి
  • కశ్మీర్ విషయంలో ఇండియాకు మద్దతిచ్చే దేశాలు మాకు శత్రువులే
  • యుద్ధం వస్తే ఆ దేశాలపైనా దాడి చేస్తామని పాక్ మంత్రి హెచ్చరిక

ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు ఏ ఒక్క దేశం నుంచీ మద్దతు దొరక్కపోవడంతో ఫ్రస్టేషన్ లో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తోంది. భారత్ కు ఏ దేశమైనా సపోర్ట్ చేస్తే తాము ఊరుకోమంటూ పాక్ మంత్రి అలీ ఆమిన్ గండాపర్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైపు నిలబడితే.. ఆ దేశాలను తాము శత్రువుగా చూస్తామని చెప్పారు. పాక్ నుంచి వచ్చే మిస్సైల్ ను ఎదుర్కొనేందుకు కూడా ఆ దేశాలు సిద్ధపడాలన్నారు.

ఓ వైపు నిన్న కశ్మీర్ లో యూరోపియన్ ఎంపీలు పర్యటిస్తుండగానే.. పాక్ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంగళవారం పాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పాక్ జర్నలిస్ట్ నాయలా ఇనాయత్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగితే పాక్ యుద్ధానికైనా సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రి అలీ అన్నారు. అయితే ఇది భారత్ పైనే కాదు, కశ్మీర్ అంశంపై ఇండియాను సపోర్ట్ చేసే ఏ దేశాన్నైనా తాము శత్రువుగానే భావిస్తామని చెప్పారు. భారత్ తో పాటు వాళ్లు కూడా పాక్ ప్రయోగించే ఆయుధాలను ఎదుర్కోవాల్సిందేనన్నారు.

భారత్ కంటే చాలా చిన్నదైన తమ దేశం యుద్ధానికి దిగే పరిస్థితి వస్తే ఎంతకైనా తెగిస్తామని చెప్పారు పాక్ మంత్రి అలీ. అణు ఆయుధాలు కలిగిన రెండు దేశాలు యుద్దం చేసేటప్పుడు అది ఆ సరిహద్దులకే పరిమితం కాదని, ఏమైనా జరగొచ్చని అన్నారు.

అయితే ఇప్పటికే అమెరికాతో పాటు, చాలా ఆసియా, యూరప్ దేశాలు కూడా భారత్ కే మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. కశ్మీర్ విషయం భారత్ అంతర్గత వ్యవహారమని చెప్పాయి.