దేశ సాంకేతిక సామర్థ్యం పెరిగింది : ప్రకాశ్ చౌహాన్

దేశ సాంకేతిక సామర్థ్యం పెరిగింది  :  ప్రకాశ్ చౌహాన్

షాద్​నగర్, వెలుగు: దేశంలో పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాలకు నిదర్శనం చంద్రయాన్ 3 అని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్​సీ) డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్ అన్నారు. ఇస్రో చేపట్టిన అన్ని ప్రయోగాలు సక్సెస్ అయ్యాయని, దీంతో ప్రపంచ దేశాలన్నీ ఇండియాను ఎంతో అభినందిస్తున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలోని అన్నారం గ్రామ సమీపంలో ఉన్న ఎన్ఆర్ఎస్​సీలో అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశ్ చౌహాన్ హాజరై మాట్లాడారు. శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 ప్రయోగాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. షాద్ నగర్ దగ్గరలో ఉన్న ఎన్ఆర్ఎస్​సీ ద్వారా భూమి పరిశీలనకు సంబంధించిన డేటాను శాటిలైట్ నుంచి పొందుతున్నామని వివరించారు.

ఏరియల్ సర్వీసెస్ డిజిటల్ మ్యాపింగ్ (ఏఎస్ఎం), ఏరియల్ ఫొటోగ్రఫి, డిజిటల్ మ్యాపింగ్, స్కానర్ సర్వీసెస్, డిజిటల్ మ్యాపింగ్ (ఏఎస్టీఎం), ఏరోమాగ్నెటిక్ సర్వేలు, లార్జ్ స్కేల్ బేస్ మ్యాప్ వంటి వివిధ భారీ స్థాయి అప్లికేషన్ ల కోసం ఎండ్ టు ఎండ్ ఏరియల్ రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తున్నదని వివరించారు. సాఫ్ట్​వేర్ డెవలప్​మెంట్, జియో స్పేషియల్ టెక్నాలజీ, జియో గ్రాఫికల్ ఇన్​ఫర్మేషన్ సిస్టమ్ నిర్వహించేందుకు ఎన్ఆర్ఎస్​సీ ఉపయోగపడుతున్నదని తెలిపారు. నేటి విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి భవిష్యత్ లో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్తున్నదని, ఇందుకు యువత అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ లక్ష్మీ నారాయణ, స్కిల్ డెవలప్​మెంట్ సీఈవో శ్రీకాంత్ సింహ్మా, ప్రొఫెసర్ నవీన్ కుమార్, డాక్టర్ రమేశ్ బాబు, వివిధ పాఠశాలల స్టూడెంట్స్ తో పాటు అంబేద్కర్ కాలేజీ విద్యార్థులు, లెక్చరర్లు హాజరయ్యారు.