నల్గొండ: యూట్యూబ్‌‌‌‌ చూసి నకిలీ కరెన్సీ తయారీ..దంపతులు అరెస్ట్‌‌‌‌

నల్గొండ: యూట్యూబ్‌‌‌‌ చూసి నకిలీ కరెన్సీ తయారీ..దంపతులు అరెస్ట్‌‌‌‌

నల్గొండ, వెలుగు : యూట్యూబ్ చూసి నకిలీ కరెన్సీ తయారీ, చలామణి చేస్తున్న దంపతులను నల్గొండ జిల్లా చండూరు పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం నల్గొండలో డీఎస్పీ శివరాంరెడ్డి మీడియాకు వెల్లడించారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్‌‌‌‌ బెజవాడ రాజీవ్‌‌‌‌ తన భార్య దుర్గం పావనితో కలిసి నకలీ కరెన్సీ తయారు చేస్తున్నాడు. ఈ నెల 12న చండూరుకు వచ్చిన రాజీవ్‌‌‌‌ ఓ మిల్క్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో పాల ప్యాకెట్‌‌‌‌ కొని రూ. 500 నకిలీ నోటు ఇచ్చాడు. నోటుపై అనుమానం కలిగిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దీంతో పోలీసులు సోమవారం నల్గొండలోని రాజీవ్‌‌‌‌ ఇండిపై దాడి చేయగా.. నకిలీ నోట్ల వ్యవహారం వెలుగుచూసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నకిలీ నోట్లు తయారు చేయాలని అనుకున్నామని, వీటి తయారీని యూట్యూబ్‌‌‌‌లో చూసి నేర్చుకున్నామని ప్రింటర్‌‌‌‌, పేపర్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కొనుగోలు చేసినట్లు రాజీవ్‌‌‌‌, పావని ఒప్పుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్‌‌‌‌ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 15 నకిలీ రూ.500 నోట్లు, ప్రింటర్, స్కానర్, బాండ్‌‌‌‌ పేపర్లు, ఓ పల్సర్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న చండూర్ సీఐ టి.రాము, ఎస్సై జె. శివకుమార్‌‌‌‌ను ఎస్పీ శరత్‌‌‌‌ చంద్ర పవార్‌‌‌‌ అభినందించారు.