రూ. 14 లక్షలు ఇస్తే తాకట్టు నగలు విడిపించి.. తెచ్చిస్తమని దంపతుల మోసం

రూ. 14 లక్షలు ఇస్తే తాకట్టు నగలు విడిపించి..  తెచ్చిస్తమని దంపతుల మోసం

సికింద్రాబాద్, వెలుగు:  తాకట్టు నగలు విడిపించి తెచ్చి ఎక్కువ లోన్ తీసుకుంటామని ఫైనాన్స్ కంపెనీని నమ్మించి రూ.14లక్షలు తీసుకుని మాయమైన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీసులు తెలిపిన ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన దాసరి శ్యామ్​కుమార్, రజనీ దంపతులు 10 రోజుల కిందట ఆనంద్​బాగ్​లోని కేఎల్ఎం యాక్సివా ఫైనాన్స్​కంపెనీకి వెళ్లి బ్రాంచ్​మేనేజర్​లావణ్యను కలిశారు. తమ 382 గ్రాముల బంగారు నగలు ఓరో ఫైనాన్స్ కంపెనీలో తాకట్టులో ఉన్నాయని చెప్పి, వాటిని విడిపించేందుకు రూ. 14. 85 లక్షలు కట్టాల్సి ఉందని తెలిపారు. ఆ డబ్బు ఇస్తే నగలు విడిపించి మీ బ్రాంచ్ లో తాకట్టుపెట్టి ఎక్కువ డబ్బులు తీసుకుంటామని మేనేజర్ లావణ్యను నమ్మించారు. 

దీంతో ఆమె లోన్​ప్రాసెస్​పూర్తి చేసి దంపతులు అడిగిన డబ్బు ఇచ్చింది. నగలు తేవాలని బ్రాంచ్​కు చెందిన ఉద్యోగిని దంపతుల వెంట పంపించింది. ఓరో ఫైనాన్స్ కంపెనీ కి వెళ్లిన దంపతులు తమ వెంట వచ్చిన వ్యక్తిని బయట ఉంచి లోపలికి వెళ్లి మేనేజర్​తో మాట్లాడారు. లోన్ ప్రాసెస్​పూర్తి చేసి నగలు ఇచ్చేస్తామని ఓరో కంపెనీ మేనేజర్​ ఒకరోజు టైమ్ అడిగారని లావణ్యకు ఫోన్​చేసి చెప్పారు. మరుసటి రోజు దంపతులకు లావణ్య ఫోన్​చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. 

దీంతో భయాందోళన చెందిన ఆమె ఓరో ఫైనాన్స్​నిర్వాహకులకు ఫోన్ చేసి దంపతుల ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. కేఎల్ఎం ఆక్సివా ఫైనాన్స్​కంపెనీ రీజినల్ మేనేజర్​ సిద్దంశెట్టి ప్రవీణ్​కుమార్​ ఫిర్యాదుతో మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.  నిందితులు దాసరి శ్యామ్ కుమార్, రజనీ దంపతులను అరెస్ట్ చేశారు.