కజిన్ బ్రదరే దొంగ.. గోషామహల్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 30 తులాల బంగారం స్వాధీనం

కజిన్ బ్రదరే దొంగ.. గోషామహల్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 30 తులాల బంగారం స్వాధీనం
  • 1.62 కిలోల వెండి, రూ.5 లక్షల నగదు కూడా రికవరీ

గోషామహల్, వెలుగు: గోషామహల్​లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కజిన్ సోదరుడినే దొంగగా తేల్చారు. గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ వివరాల ప్రకారం.. బాధితుడు మహేశ్ కుటుంబ సభ్యులతో కలిసి లంగర్​హౌస్​లోని తన బంధువుల పెండ్లికి వెళ్లిన సమయంలో, పక్కింట్లోనే నివసించే అతని కజిన్ సోదరుడు దొంతుల రాజేశ్ ఈ చోరీకి పాల్పడ్డాడు. కిరాణా షాపు నిర్వహిస్తున్న రాజేశ్.. బెట్టింగ్​లకు అలవాటు పడి, అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఈ దొంగతనానికి ఒడిగట్టాడు. 

పెండ్లి వేడుకలో మహేశ్ భార్య ధరించిన నగలను గమనించి, చోరీకి ప్లాన్ వేశాడు. మే 10న రాత్రి కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లిన తర్వాత.. టెర్రస్ మార్గంగా ఇంట్లోకి ప్రవేశించాడు. రెండో అంతస్తు తాళం పగులగొట్టి వెతికినా ఏమీ దొరకకపోవడంతో, మూడో అంతస్తులోని బీరువాను పగులగొట్టి రూ.5 లక్షల నగదు, సుమారు 30 తులాల బంగారం, 1.62 కిలోల వెండి ఆభరణాలను అపహరించాడు. 

ఎవరికీ అనుమానం రాకుండా దొంగిలించిన వస్తువులను తన ఇంట్లోనే దాచిపెట్టి, పోలీసుల దర్యాప్తు సమయంలో వారి పక్కనే ఉంటూ ఏమీ ఎరగనట్లు నటించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన గోషామహల్ సీఐ శ్రవణ్ కుమార్, డిటెక్టివ్ ఎస్సై అజీత్ సింగ్ బైర్వా బృందం సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించారు. నిందితుడి నుంచి మొత్తం సొత్తును రికవరీ చేసి, అతడిని 
రిమాండ్​కు తరలించారు.